Lord Shiva : హిందువులు భక్తి శ్రద్దలతో పూజించే దేవుళ్లలల్లో శివుడు కూడా ఒకడు. శివుడిని మహాకాళుడు, ఆది దేవుడు, శంకరుడు, చంద్రశేఖరుడు, జటాధరుడు, మృత్యుంజయుడు, త్రయంబకుడు, మహేశ్వరుడు, విశ్వేశ్వరుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. దేవతల దేవుడైన శివుడిని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయని అలాగే శివుడి ఆశీస్సులు ఉన్న వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నమ్ముతారు. శివుడి అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శివుని మెడలో పాము, తలపై గంగ, నుదుటిపై చంద్రుడు ఉంటారు. అయితే శివుని తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో మనలో చాలా మందికి తెలియదు. కానీ దీని గురించి శివపురాణంలో చెప్పబడింది. శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సముద్ర మథనం నుండి విషం వెల్లువడినప్పుడు దేవులందరూ ఆందోళన చెందారు. అప్పుడు శివుడు ఈ విషాన్ని తాగి లోకాన్ని రక్షించాడు. అయితే శివుడు ఈ విషాన్ని మింగలేదు. తన గొంతులో దాచుకున్నాడు. ఈ కారణం చేత శివుడి గొంతు నీలం రంగులోకి మారింది. అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అనే కూడా పిలుస్తారు. ఇక చంద్రుడు చల్లదనానికి ప్రసిద్ది. అలాగే సృష్టిలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాడు. చంద్రుడిని ధరించడం వల్ల విషం తాగిన శివుని శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుందని దేవుళ్లందరూ నమ్మారు. చంద్రుడుని ధరించమని దేవతలందరూ ప్రార్థించగా వారి ప్రార్థనలు అంగీకరించి చంద్రుడిని శివుడు తలపై ధరించాడు. ఇలా శివపురాణంలో చెప్పబడింది. ఇక మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పురాణాల ప్రకారం చంద్రుడికి 27 మంది భార్యలు. వారిని నక్షత్రాలు అని పిలుస్తారు. ఇందులో రోహిణి నక్షత్రం మాత్రమే చంద్రుడికి దగ్గరగా ఉండేది.
దీంతో మిగిలిన భార్యలు అసూయ చెంది తమ తండ్రి ప్రజాపతి దక్షునికి మొరపెట్టుకున్నారు. దీంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రుడిని క్షయ అని శపించాడు. ఈశాపం వల్ల చంద్రుడు దశలు క్రమంగా తగ్గడం ప్రారంభించాయి. అప్పుడు చంద్రుడు నారుదున్ని సహాయం కోరగా నారదుడు శివున్ని ప్రార్థించమని సూచించాడు. చంద్రుడు వెంటనే శివుని గురించి తపస్సును ప్రారంభించాడు. అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు కరుణించి శాపాన్ని తొలగించాడు. శాపం తొలగించిన తరువాత చంద్రుడు తనని శివుడి తలపై ధరించమని కోరాడు. దీంతో శివుడు, చంద్రుడిని తలపై ధరించాడు.