Brain Size And Intelligence : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వందల కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా ఎవరి తెలివి తేటలు వారికే ఉంటాయి. ఒకరి తెలివి మరొకరి సొంతం కాదు. అలాగే కొందరు పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాల్లో విశేషమైన ప్రతిభ చూపితే కొందరు కళల్లో నిష్ణాతులై ఉంటారు. ఇక ఒక్కొక్కరికీ ఒక్కో అంశంలో ప్రావీణ్యత ఉంటుంది. అయితే ఏ అంశంలో అయినా సరే.. మనిషి ప్రతిభా పాటవాల విషయానికి వస్తే అంతగా నైపుణ్యం లేని వారు, నైపుణ్యం ఉన్నవారిలో మెదడు ఒకే రకంగా ఉంటుందా, తేడా ఉంటుందా..? అన్న సందేహం సైంటిస్టులకు వచ్చింది. తెలివితేటలు లేని వారి మెదడు సైజు, ఉన్నవారి మెదడు సైజు ఒకే రకంగా ఉంటుందా, అందులో ఏమైనా తేడాలు ఉంటాయా, చిన్న సైజు లేదా పెద్ద సైజు మెదడు.. రెండింటిలో ఏ సైజులో మెదడు ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి..? అనే విషయంపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. మరి చివరకు తెలిసిందేమిటంటే..
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు గతంలో 13,600 మంది భిన్నమైన వ్యక్తులకు ఎంఆర్ఐ తీశారు. వారి మెదడు సైజు, వారి తెలివి తేటలు, ఆయా అంశాల్లో వారికి ఉన్న నైపుణ్యత, ప్రతిభా పాటవాలు.. తదితర వివరాలను సేకరించారు. చివరకు వెల్లడైందేమిటంటే.. మెదడు సైజుకు, తెలివితేటలకు సంబంధం లేదని తేల్చారు. పెద్ద సైజులో మెదడు ఉన్నా, చిన్న సైజులో ఉన్నా.. మెదడులో ఉండే న్యూరాన్ల యాక్టివిటీ ముఖ్యమని తేల్చారు. అవి చురుగ్గా ఉంటే తెలివితేటలు ఉంటాయని, లేకపోతే ఏ అంశంలోనూ నైపుణ్యత ప్రదర్శించలేరని సైంటిస్టులు తేల్చారు. కను మెదడు సైజుకు, ప్రతిభా పాటవాలకు సంబంధం లేదని వారు చెబుతున్నారు.
ఇక ఒకప్పటి నియండెర్తల్ మానవులకు మనకన్నా 10 శాతం మెదడు సైజు ఎక్కువగా ఉండేదని, కానీ వారి కన్నా చిన్న సైజు మెదడు కలిగిన మనకే తెలివి తేటలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే జంతువుల్లో మాత్రం చిన్న సైజులో మెదడు ఉండే బల్లి, కీటకాలు తదితర జీవాల కన్నా పెద్ద సైజులో మెదడు ఉండే ఏనుగులు, గుర్రాలు తదితర జీవాలకే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక మనుషుల్లో పురుషుల కన్నా స్త్రీల మెదడు సైజు తక్కువగా ఉంటుందని, అంత మాత్రం చేత పురుషులే తెలివికల వారని చెప్పలేమని, స్త్రీలలోనూ ప్రతిభా పాటవాలు ఎక్కువగా ఉన్న వారు చాలా మంది ఉన్నారని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక మనుషుల వరకు వస్తే.. మెదడు సైజుకు, ప్రతిభకు సంబంధం లేదని సైంటిస్టులు తేల్చి చెబుతున్నారు.