నేను ఓ టాప్ యాక్టర్ ని, స్టైలిష్,ఎనర్జిటిక్ హీరో అనేవి నా స్క్రీన్ టైటిల్స్. 25 ఏళ్ళప్పుడు నా పెళ్లైంది., ఆమె మా చుట్టాలమ్మాయి.! చాలా సాంప్రదాయ కుటుంబానికి చెందింది. కానీ నాకు అది నచ్చేది కాదు..స్టైలిష్ గా, మోడ్రన్ గా ఉండాలని ఆమెకు చాలా సార్లు చెప్పాను. ఆమె కొంత మారింది కానీ నేనకున్నంతగా కాదు. ఆమెను బయటికి తీసుకెళ్లాలంటేనే సిగ్గుగా అనిపించేది. అందుకే చాలా ఫంక్షన్ లకు నేనొక్కడినే అడెంట్ అయ్యేవాడిని..ఈ క్రమంలోనే మాకిద్దరు పిల్లలు.!
ఆమెను భరించడం నా వల్ల కాలేదు. అందుకే ఆమెకు విడాకులిచ్చేసి., నాతో పాటు సినిమాలో నటించే ఓ యంగ్ హీరోయిన్ ని పెళ్లిచేసుకున్నాను. అందం అంటే ఈమెది.! నాకన్నా మోడ్రన్ అండ్ స్టైలిష్.. ఇప్పుడు నేను వెళ్లే ప్రతి ఫంక్షన్ కు నాతో పాటు ఆమె ఉండాల్సిందే. కొన్ని రోజులు ఇదంతా బాగానే ఉంది. కానీ రాను రాను ఆమె ప్రవర్తన మరీ వింతగా మారింది. నా అవసరాలు, నాకంటే కూడా ఆమెకు ఆమె అందం మీదే కాన్సంట్రేషన్ ఎక్కువైంది. నాతో కంటే అద్దంతో గడపడమే ఎక్కువైంది. ఫ్యాషన్ వీక్స్, పార్ట్రీస్ అంటూ ఇష్టమొచ్చినట్లు తిరగడం స్టార్ట్ చేసింది. ఇదే టైమ్ లో వరుసగా నా 4 సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇండస్ట్రీ నన్ను పట్టించుకోవడమే మానేసింది.నా రెండో భార్య నాకు విడాకులిచ్చేసి ఫామ్ లో ఉన్న మరో హీరోని పెళ్లి చేసుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ కి 5 ఏళ్ళు పట్టింది.
నన్ను నేను నిందించుకుంటూ ఓ రోజు బాల్కానిలో కూర్చొని పేపర్ చదువుతున్నాను. ప్రపంచం మెచ్చిన అద్భుతమైన వంటలు చేసే ఛెఫ్ అంటూ ఓ ఇంటర్వ్యూ ఆ పేపర్ లో కనిపించింది. ఆసక్తిగా చదివాను. తనెవరో కాదు నా మొదటి భార్య… వెంటనే నా పిల్లలు గుర్తొచ్చారు. ఎలాగైనా ఓ సారి తనను కలవాలని గట్టిగా ప్రయత్నించి తన అడ్రస్ కనుక్కొని తనుండే చోటుకి వెళ్లాను., తను నన్ను కలవడానికి ఇష్టపడలేదు. కానీ నా కోరిక మేరకు నా పిల్లలతో గంట మాట్లాడడానికి అవకాశమిచ్చింది. పిల్లాడైతే అచ్చం నాలాగే ఉన్నాడు, అమ్మాయిది మాత్రం అమ్మ పోలిక.! కన్నీళ్ళతో నా కర్చీఫ్ అంతా తడిసిపోయింది. చేజేతులా నే చేసుకున్నదే కదా ఇదంతా.!