ఐఫోన్, ఐప్యాడ్ వంటి గ్యాడ్జెట్లను తయారు చేసే యాపిల్ సంస్థ గురించి తెలుసు కదా..! దాని గురించి తెలియని వారుండరు. అయితే దాని వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ గురించి కూడా చాలా మందికి తెలుసు. ఆ సంస్థను విజయపథంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమించాడాయన. ఆయన 2011లో చనిపోయారు. అయినప్పటికీ ఆయన తయారు చేసిన ఐఫోన్ నేడు స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. అయితే స్టీవ్ జాబ్స్ గురించిన ఆసక్తికర విషయం ఒకటుంది. అదేమిటంటే…
స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ నంబర్ లేని కారులో ప్రయాణించేవారట. ఆ కారు బెంజ్ కంపెనీకి చెందినది. దాని పేరు Mercedes SL55 AMG. సిల్వర్ కలర్ కారది. సాధారణంగా ఏ దేశంలోనైనా అలా నంబర్ లేని వాహనాల్లో ప్రయాణించడం చట్ట రీత్యా నేరం. ఇక అమెరికాలో చట్టాలు అయితే ఇంకా కఠినంగా ఉంటాయి. అలాంటిది స్టీవ్ జాబ్స్ అలా నంబర్ లేని కారులో ఎలా ప్రయాణించాడు..? అని అనబోతున్నారా..? అయితే ఆగండి.. ఎందుకంటే… అందుకో కారణం ఉంది. అంతేకానీ… స్టీవ్ జాబ్స్ చట్టాలను ఉల్లంఘించే వాడు మాత్రం కాదు.
స్టీవ్ జాబ్స్ నివసించే అమెరికాలోని కాలిఫోర్నియాలో వాహనాల నంబర్లకు గాను ఓ చట్టం ఉంది. అదేమిటంటే… అక్కడ కొత్తగా వాహనాన్ని కొనే వారు దాన్ని 6 నెలల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పటి వరకు నంబర్ లేకుండా తిరగొచ్చు. దీన్ని స్టీవ్ జాబ్స్ ఆసరగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన 6 నెలలకు ఒకసారి కారును మార్చేవారు. అలా మెర్సిడెస్ కంపెనీతో ఆయన ఒప్పందం కుదుర్చుకునే వారు. అందులో భాగంగానే ఆయన అదే మోడల్ కలిగిన సిల్వర్ కలర్ మెర్సిడెస్ కారును 6 నెలలకు ఓసారి మార్చేవారు. అంటే 6 నెలలు కాగానే పాతబడిన తన కారును తీసేసి మళ్లీ కొత్త కారును తీసుకునేవారు.
దీంతో అక్కడి వాహనాల చట్టం ప్రకారం ఆ కొత్త కారుకు నంబర్ తీసుకునేందుకు ఎలాగూ 6 నెలల సమయం ఉంటుంది కదా. అది స్టీవ్ జాబ్స్‌కు కలసి వచ్చేది. అయితే ఆయన ఇలా ఎందుకు చేసేవారంటే… నంబర్ ఉన్న కారు అయితే తన కదలికలను ట్రాక్ చేస్తారని, దాంతో తన ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆయన నమ్మేవారు. అందుకే అలా కార్లను మార్చేవారు. అవును మరి. అంతే కదా. అలాంటి ప్రముఖ వ్యక్తులకు ఆ మాత్రం ప్రైవసీ ఉండాలి. ఆ మాట కొస్తే సాధారణ ప్రజలకు ఎవరికైనా ఎవరి ప్రైవసీ వారికి ఉండాల్సిందే కదా..!