స్వల్ప అనారోగ్యం కలిగిందంటే చాలు. మెడికల్ షాపుకు వెళ్లో లేదంటే ఇంట్లోనే ఉన్న ఇంగ్లిష్ మందులను వేసుకోవడం మనకు పరిపాటి. కానీ వాటిని పదే పదే వాడడం, అందులోనూ డాక్టర్ సలహా లేకుండానే ఉపయోగించడం ప్రమాదకరమని కూడా తెలుసు. అయినా వాటిని వాడకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి వాటి జోలికి పోకుండా మనకు కలిగే చిన్నపాటి అనారోగ్యాలను కూడా యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వెనిగర్ సాధారణ వెనిగర్ మాత్రం కాదు సుమా! ఎందుకంటే యాపిల్ పండ్లను కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంచి వాటి ద్వారా తీసిన వెనిగర్‌నే యాపిల్ సైడర్ వెనిగర్ అంటారు. దీన్ని సహజ సిద్ధమైన ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.
కడుపులో మంట, అజీర్ణం వంటి లక్షణాలను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. సింపుల్‌గా 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుంటే చాలు. అది సహజ సిద్ధమైన అంటాసిడ్‌గా పనిచేసి కడుపులో ఏర్పడే సమస్యలను తొలగిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌తో గొంతు వాపు కూడా తగ్గుతుంది. దీన్ని కొద్దిగా తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించాలి. దీంతో గొంతులో ఏర్పడే వాపు, నొప్పి తగ్గుతాయి. సమస్య ఉన్నప్పుడల్లా ఈ పద్ధతిని ట్రై చేయవచ్చు. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగితే సైనస్ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. జలుబు, పడిశం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
కప్పులో 1/4 వంతు యాపిల్ సైడర్ వెనిగర్, అంతే మొత్తంలో నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా పట్టించాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ సెప్టిక్ ధర్మాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంపై ఏర్పడే మంట, దురదలను తగ్గిస్తాయి. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని కాటన్‌తో చర్మంపై రాయాలి. దీంతో చర్మంపై వచ్చే దురద తగ్గుతుంది. అధిక శాతం మందికి రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుంటాయి. శరీరంలో తగినంత పొటాషియం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. దీన్ని కొద్దిగా తీసుకుని కొంత మొత్తంలో తేనెకు కలిపి తాగితే ఫలితం కనిపిస్తుంది.
శరీరంపై ఏర్పడే మచ్చలను తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని కాటన్ బాల్‌తో సమస్య ఉన్న ప్రాంతంపై రాయాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. చర్మంలో పీహెచ్ స్థాయిలు అసాధారణ రీతిలో ఉంటే కాళ్ల నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీన్ని నియంత్రించాలంటే యాపిల్ సైడర్ వెనిగర్‌ను కాళ్లపై నేరుగా రాయాలి. లేదా ఈ వెనిగర్ కలిపిన నీటిలో కాళ్లను కొంత సేపు ఉంచాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.