జెండాపై కపిరాజుంటే రథమాపేదెవడంటా… ఇది ఒక సినిమాలో పాట… కానీ నిజంగా ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు హనుమంతుడిని తలచుకుంటే ఆ పని సక్రమంగా జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అదే విధంగా చాలా మంది తమ వాహనాలపై హనుమంతుడి బొమ్మ పెట్టుకుంటారు. దీనికి ఒక కారణం ఉంది. మహాభారతంలోని కురుక్షేత్రంలో అర్జునుడు రథంపై హనుమంతుడి జెండా ఉంటుంది. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. కానీ దీనిగురించి ఎక్కువ మందికి తెలీదు. అసలు అర్జునుడి రథంపై హనుమంతుడు ఎందుకు ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేశయాటనకు బయల్దేరిన అర్జునుడు ఒక సమయంలో రామేశ్వరానికి చేరుకుంటాడు. అయితే ఆ ప్రాంతంలో రాముడు ప్రతిష్టించిన శివ లింగానికి పూజలు చేసిన అనంతరం సముద్రం దగ్గరకు చేరుకుంటాడు.
అక్కడ రామసేతువును చూసి అర్జునుడు ఆశ్చర్యానికి గురి అవుతాడు. రాముడు తలచుకుంటే తన బాణాలతోనే ఒక వారధిని నిర్మించగలడు. అలాంటిది వానరాలతో ఎందుకు రామసేతువును నిర్మించాడు అని సందేహ పడతాడు. అర్జునుడు మనసులో అనుకున్న మాటలు అక్కడే ధ్యానం చేసుకుంటున్న హనుమంతుడు వెంటాడు. వెంటనే వానర రూపం ధరించిన హనుమంతుడు అర్జునుడి దగ్గరకు వచ్చి ‘మీరు మనసులో ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మీ సమస్య నాకు చెప్పండి. మీ సందేహాన్ని నేను తీరుస్తాను’ అని అర్జునుడిని అడుగుతాడు. దీంతో అర్జునుడు తన సందేహాన్ని హనుమంతుడికి చెబుతాడు. ‘మీరు అన్నట్లే శ్రీ రాములు వారు తన బాణాలతో వారధిని నిర్మించగలరు. కానీ వాటిపై వానర సైన్యం వెళ్లలేదు. అందుకోసమే రాముని ఆజ్ఞతో వానరులు రామసేతుని నిర్మించారు’ అని సమాధానం చెబుతాడు హనుమంతుడు.
కానీ హనుమంతుడి సమాధానంతో అర్జునుడు తృప్తి చెందలేదు. రాముడు బాణాలతోనే వారధి నిర్మిస్తే తాను సంతోషించేవాడిని చెబుతాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. నీవు గొప్ప విలుకాడివి అయితే బాణాలతో వారధిని నిర్మించమని హనుమంతుడు అర్జునుడితో అంటాడు. దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను. నా బరువును అది తట్టుకుంటే నా రాముడు చేసింది తప్పు అని ఒప్పుకుని నీకు నమస్కారం చేస్తా అని అంటాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలు విని కోపం వచ్చి ‘నాకే సవాల్ విసురుతావా.. సరేనని బాణాలతో వారధి నిర్మిస్తా… దానిపై నువ్వు వెళ్లు అది కూలిపోతే ప్రాణ త్యాగం చేస్తానని’ బాణాలతో వారధి నిర్మిస్తాడు అర్జునుడు. ఆ వారధిపై హనుమంతుడు అడుగు పెట్టగానే వారధి కూలిపోతుంది.
తన ఓటమిని అంగీకరించి అగ్ని ప్రవేశానికి వెళ్తున్న అర్జునుడిని అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆపి మళ్లీ మీరు వారధి నిర్మించండి ఈ సారి నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తా అనడంతో అర్జునుడు మరోసారి బాణాలతో వారధి నిర్మిస్తాడు. అయితే ఈ సారి హనుమంతుడు ఆ వారధిపై నడిచినా వారధి కూలిపోదు. దీంతో ఇద్దరికి అర్ధం అవుతుంది. ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది శ్రీ కృష్ణుడని. వారిద్దరికీ శ్రీ కృష్ణుడు నిజ రూప దర్శనాన్ని కల్పిస్తాడు. మీరిద్దరు గొడవ పడకండి. మిమ్మల్ని నేను స్నేహితులుగా చూడాలనుకొంటున్నాను అని కృష్ణుడు కోరతాడు. అర్జునా ఇప్పటి దాకా నువ్వు వాదిస్తున్నది ఒక వానరంతో కాదు. ఆయన హనుమంతుడు అని చెప్పగానే హనుమంతుడు తన అసలు రూపంలోకి వస్తాడు. దీంతో వారిద్దరి మధ్య కృష్ణుడు సంధి కుదర్చడంతో స్నేహితులుగా మారతారు. అప్పటి నుంచి అర్జునుడు తన రధంపై హనుమంతుడి జెండా పెట్టుకుంటున్నాడు.