అన్నం వండేటప్పుడు బియ్యం ఉడకగానే అందులోని నీటి(గంజి)ని పారబోస్తారు, తెలుసు కదా. ఇప్పటికీ మన ఇండ్లలో ఇలా గంజిని పారబోసే వారు ఉన్నారు. అయితే గంజిలోనూ అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయన్న సంగతి ఇప్పటి వారికి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో అసలు గంజితో మనం ఎలాంటి లాభాలు పొందవచ్చు, దాని వల్ల ఏయే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గంజిలో ఓ కాటన్ బాల్ ముంచి దాన్ని ముఖంపై మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో మొటిమలు తగ్గిపోతాయి. అక్కడ ఏర్పడే వాపు కూడా పోతుంది.
ఒక గ్లాస్‌లో గంజి నీటిని తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి. అనంతరం బాగా కలపాలి. అలా కలపగా వచ్చిన మిశ్రమాన్ని తాగితే డయేరియా వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. గంజిలో మన శరీరానికి కావల్సిన అత్యంత కీలకమైన 8 రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. కండరాలను పునరుద్ధరిస్తాయి. మనల్ని ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి. చర్మంపై వచ్చే దురదను, మంటను తగ్గించేందుకు కూడా గంజి ఉపయోగపడుతుంది. కొద్దిగా గంజిని తీసుకుని బాగా చల్లార్చిన పిదప దాన్ని చర్మంపై సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో దురద, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
గంజి నీటిని ముఖానికి రాసి కొంత సేపటి తరువాత కడిగేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది. చర్మానికి సహజ సిద్ధమైన టోనింగ్‌ను ఇచ్చే గుణాలు గంజిలో ఉన్నాయి. ఇవి ముఖాన్ని కాంతివంతం చేస్తాయి. వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను దూరం చేస్తాయి. షాంపూతో తలస్నానం చేశాక గంజి నీటిని వెంట్రుకలకు పట్టించి కొంత సేపటి తరువాత మళ్లీ స్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకలకు ఆరోగ్యం చేకూరుతుంది. శిరోజాలు కాంతివంతమవడమే కాదు, అవి దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. గంజి నీటిలో దుస్తులను కొంత సేపు నానబెట్టి అనంతరం వాటిని ఉతికితే దుస్తులు మెరుస్తాయి. వాటికి ఉండే మురికి కూడా పోతుంది.