డయాబెటీస్ వచ్చినప్పటికి ఉద్యోగం మానేయాల్సిన అగత్యం లేదు. డయాబెటీస్ వుందని దాచుకోవాల్సిన అవసరంలేదు. తోటి ఉద్యోగులకు అది వుందని తెలపండి. షుగర్ సాధారణ స్థాయి కంటే తక్కువకు పడితే ఏం చేయాలనేది కూడా వారికి చెప్పండి. సాధారణంగా ఇతరులు తెలియని దాని గురించే భయపడతారు. తెలిస్తే వారికి కూడా ఆందోళన తగ్గుతుంది. డయాబెటీస్ రోగులు ఉపవాసం ఉంటే… సాధారణంగా మతపర ఆచారాలకై ఒక్కక్కపుడు ఏ ఆహారం తీసుకోకుండా ఉపవాసం వుంటారు. డయాబెటీస్ రోగులకు ఉపవాసం క్లిష్టమైనదే. జాగ్రత్త అవసరం. ఉపవాసం ఉండే రోజు ప్రతి దినం వేసుకొనే డయాబటిక్ మందులు మానండి.
ఇన్సులిన్ తీసుకునే వారైతే ఉపవాస సమయాన్ని బట్టి డోసేజీ తగ్గించండి. ఎప్పటికపుడు నీరసం రాకుండా లేదా కళ్ళు బైర్లు కమ్మకుండా తగిన జాగ్రత్తలతో ఉపవాసం కొనసాగించండి. డయాబెటీక్ రోగులు, హాస్పిటల్ ప్రవేశం… ఏ కారణం చేత ఆస్పత్రిలో చేరినప్పటికి డయాబెటీస్ రోగులు అప్రమత్తంగా వుండాలి. అడ్మిషన్ సమయంలోనే అక్కడి డాక్టర్లకు, నర్సులకు డయాబెటిక్ రోగినని తెలుపాలి. మీరు వాడే మందులు, దాని స్ధాయి వారికి తెలుపాలి. హాస్పిటల్ లో వున్నంత కాలం మీకు గల ఇతర వ్యాధులు తగ్గటానికి కూడా డయాబెటీస్ ను అదుపులో వుంచాలి. ఆహారం తినటానికి అనుమతించకపోతే కనీసం గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ వంటివైనా సరే ఇచ్చి షుగర్ స్ధాయిని అదుపులో వుంచాలి.
ఇక డిశ్చార్జి సమయానికి మీ సాధారణ ఆహారానికి దైనందిన మందులకు అలవాటు పడాలి. కొంతమంది మహిళలకు రుతుక్రమ సమయానికి ముందర షుగర్ స్ధాయి అధికమవుతుంది. దీనికి పరిష్కారంగా ఆ రోజులలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచండి. కొంతమందికి షుగర్ స్ధాయి తగ్గుతుంది. అటువంటపుడు డోసేజీ తగ్గించండి. ఈ ఇన్సులిన్ డోసేజి లేదా మందులు పెంచటానికి, తగ్గించటానికి లేదా ఎంత మొత్తంలో తీసుకోవాలనటానకి నిర్దేశిక కొలతలు ఏమీ లేవు. ప్రతి రోగి తన శరీర స్ధితిని బట్టి మందుల వాడకాన్ని కొనసాగించాలి.