మానససరోవర ప్రయాణంలో ఒక కొండ గుహలోని హనుమంతుడి రూపం ఒక కెమెరా కంటికి చిక్కడం, ఆ ఫొటో తీసినాయన గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మోక్షాన్ని పొందటం నిజంగా అదృష్టమే కదా! ఒక ఏనుగు, సింహం ప్రక్కప్రక్కనే నడుస్తూ ఆ సివంగి కూనను ఏనుగు తన తొండంతో పట్టుకుని రోడ్డు దాటించడం, నిజంగా ఎంత జంతుతత్వమో…! ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కోవారు మన జన గణ మనను గుర్తించారంటే నిజంగా గర్వంతో మనసు ఉప్పొంగుతుంది కదా! సాధారణంగా మనిషి శరీరం 45 డెసిబల్స్ నొప్పిని మాత్రమే తట్టుకుంటే, ఒక తల్లి పడే ప్రసవ వేదన ఏకంగా యాభై ఏడు డెసిబెల్స్ ఉండటం నిజంగా అమ్మ తన బిడ్డ మీద పెంచుకునే ప్రేమకి నిదర్శనం, ఏమంటారు!
పైన ప్రస్తావించిన విషయాలన్నీ మొదటిసారి విన్నప్పుడు, లేదా చూసినప్పుడు భలే అన్పిస్తాయి. వెంటనే అందరితో మనకి తెలిసిన సమాచారాన్ని పంచుకోవాలి అన్పిస్తుంది. ఐతే, ఇవన్నీ నిజాలేనా? ఆ ఆలోచన మనకు సాధారణంగా రాదు. పైన చెప్పినవాటిలో ఒక్కటి కూడా నిజం కాదు. కాకపోతే నిజాలే నన్నట్లు అందరినీ భ్రమింపజేసిన, చేస్తున్న అసత్యాలు. ఈ మాట మాత్రం ముమ్మాటికీ నిజం! మనకి తెలియకుండానే ఎన్నో రకాల తప్పుడు కథనాలను మనమే ప్రచారం చేసేస్తున్నాం. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ మొదలుగు వాటి ద్వారా అందరితో సమాచారాలను పంచుకోవడం జరుగుతుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ సంఖ్య మరీ ఎక్కువయింది. దాంతో, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సాంఘిక మాధ్యమాల పైనా నిఘా వేసి ఇటువంటి అసత్య ప్రచారాలను అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలా తప్పుడు సమాచారాన్ని సామాన్య జనం మాత్రమే కాక ప్రముఖులు కూడా పంచుకోవడం చాలాసార్లు జరిగింది. ప్రముఖులకి ఇటువంటి సోషల్ ప్లాట్‌ఫారముల్లో అధికంగా ఫాలోవర్లు ఉండటం చేత నష్టం పదింతలు ఎక్కువగా వుంటుంది. వారికి అసలు నిజం తెలిసేప్పటికే అబద్ధం ప్రపంచం మొత్తాన్నీ పాకేస్తుంది. తర్వాత నాలిక కరుచుకుని అంతా తూచ్ అన్నా కొన్నిసార్లు లాభం ఉండకపోవచ్చు! తెలిసిన మంచిని పంచుకోకపోయినా పర్వాలేదుగానీ, అరకొర విషయ పరిజ్ఞానంతో అసత్యాన్ని ప్రచారం చెయ్యడం పాపమే కాదు, చట్టరీత్యా కొన్నిసార్లు నేరము కూడా. కనుక, ఏదయినా సమాచారం తెలియగానే వెంటనే పదిమందికీ షేర్లు, ఫార్వర్డులు చెయ్యకుండా ముందుగా ఆ వార్త నిజమైనదేనా అని నిమ్మళంగా ఒక్కసారి చెక్ చేసుకోవడం వలన ముందు ముందు సమస్యలు రాకుండా తప్పించుకోవచ్చు. మనకు కూడా ఇంకా క్షుణ్ణంగా విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది.