ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి. ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. తర్వాత ఆరేయాలి. ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి. ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల పొడిని వాషింగ్ పౌడర్ లో కలిపి బట్టలు ఉతికితే బట్టలు తెల్లగా ఉంటాయి.
క్లాత్ పై గమ్ అతుక్కుంటే కొద్ది సేపు ఐసుముక్కను క్లాత్ పై ఉన్న గమ్ పై ఉంచి ఆ తర్వాత గీరేస్తే గమ్ ఊడిపోతుంది. కొత్త బట్టలు, సిల్కు బట్టలు ఉతికేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే వాటి మృదుత్వం, రంగు పోకుండా కాపాడుకోవచ్చు. గోడకు కొట్టిన మేకుకి బట్టలు తగిలించి తీసేటప్పుడు హడావిడిగా లాగితే చిరిగే ప్రమాదం ఉంది. ఆ మేకులో రబ్బరు కాని, స్పాంజ్ కాని గుచ్చి ఉంచితే బట్టలు చిరగవు. చేతి గుడ్డలకు, రిబ్బన్లకు పట్టిన మురికి పోవాలంటే ఉప్పు కలిపిన నీటిలో ఉతికితే చాలు.
చేతితో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు దారపు ఉండని చిన్నకప్పులో వేసి కుట్టుకుంటే దారం ఎక్కడికో వెళ్ళటం, వెతుక్కోవటం ఉండదు. జడల చమురు జాకెట్ల వెనుక అంటుతుంది. సోపుతో ఉతికితే గుడ్డ కాంతి పోతుంది. కనుక పత్తిలో కాని గుడ్డ ముక్కలో కాని పెట్రోలు అద్ది చమురున్న భాగాన రాస్తే కొత్త జాకెట్లా తయారు అవుతుంది.