ఒక మారుతి కారు తయారు చెయ్యటానికి పట్టే సమయం 12 గంటలు. మారుతి ఫ్యాక్టరీ నుండి ప్రతి పది సెకన్లకు తయారైన కారొకటి బయటికొస్తుంది. టూకీగా – తయారైన కార్లను మారుతి అమ్ముతుంది, జనం కొంటారు. కానీ రోల్స్ రాయిస్ కారు ఎవరోకరు కొని, ఆర్డరు ఇచ్చిన తరువాతే తయారీ మొదలవుతుంది. ఏడాదికి సగటున 4,000 నుండి 5,000 కార్లు మాత్రమే తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్త కస్టమర్ల కోసం. ప్రత్యేకమైన ఆప్షన్లు, ఎంపికలు ఏవీ లేని రోల్స్ రాయిస్ కారు తయారీకి కనీసం 3 నెలలు పడితే వ్యక్తిగత ఎంపికలు, ఆప్షన్స్ బట్టి ఏడాది దాకా పట్టవచ్చు.
లోహపు రేకులు, ఇంజను భాగాలు తప్ప మిగతా అన్నీ చేతులతో చేసేవే. కారు లోపల, వెలుపల వేసుకోటానికి సంస్థ వద్ద 44,000 రంగుల పట్టిక ఉంటుంది. నచ్చిన రంగులు అందులోంచి ఎంచుకోవచ్చు, లేదా ఆ 44,000 కాకుండా వేరే ఏ రంగైనా సంస్థకు చెబితే ఆ రంగు తయారు చేసి వేస్తారు. బాహ్య పెయింటింగ్ ప్రక్రియ అయిదు పొరల్లో, 22 దశల్లో సుమారు 50 కిలోల పెయింటుతో వారం రోజుల పాటు జరుగుతుంది. ఇదొక్కటే రోబోలు చేసే పని. ప్రతి రోల్స్ రాయిస్ కారు పొడుగు సాంతం రెండు గీతలు ఉంటాయి. వాటిని గత 18 ఏళ్ళుగా ఒకే పెయింటర్ (Mark Court) వేస్తున్నారు. ఆయన ఒక కారుపై ఈ గీతలు వెయ్యటానికి 3 గంటల సమయం పడుతుంది. కొనుగోలు దారుల ప్రత్యేకమైన డిమాండు బట్టి ఏవైనా డిజైన్లు వెయ్యవలసి వస్తే అది అదనం. ఇందుకు ఆయన వాడే బ్రష్షులు కూడా ప్రత్యేకమైనవే (ఎద్దు, ఉడుత వెంట్రుకలతో తయారైనవి).
కారు లోపల పైకప్పుపై కావలసిన నక్షత్ర మండలాన్ని పోలినట్టు 1,600 ఫైబర్-ఆప్టిక్ లైట్లు అమర్చి ఇవ్వగలరు. ఇది కూడా కళాకారులు చేత్తో చేస్తారు కావున ఒక కారుకు దాదాపు రెండు వారాలు పడుతుంది. ఇందుకు సుమారు రెండు కిలోమీటర్ల పొడుగు వైర్లు వాడతారు. కారులో upholstery (సీట్లు, డ్యాష్‌బోర్డు వగైరా) కొరకు వివిధ రకాల లెదర్ ఎంపికలు ఉన్నాయి. ఆ చర్మం కోసమే సంస్థ కొందరు కాపరులతో ఎడ్లకు ప్రత్యేకమైన తిండి పెట్టి పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. ఒక కారుకు కుట్టు పని చెయ్యటానికి 17 రోజులు పడుతుంది – చేత్తోనే కుడతారు, మెషీన్లు వాడరు. కావాలంటే నిప్పుకోడి చర్మంతోనూ సీట్ల కవర్లు కుట్టిస్తారట. రోల్స్ రాయిస్ కార్లకే ప్రత్యేకమైన ఎయిర్ సస్పెన్షన్ రోడ్డుపై గుంతలు కారులోకి తెలియకుండా ఉండేందుకు ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందంటే, ప్రయాణికులు సీటులో కదిలినా సెన్సర్లు తెలుసుకుని సస్పెన్షన్‌ను తదనుగుణంగా మారుస్తాయి.
ఒక కారులో ఒకే చెట్టు నుండి తీసుకున్న చెక్కను వాడతారు. ఈ చెక్క పలకల తయారీకే నాలుగు వారాల దాకా పడుతుంది – అదీ చేత్తోనే, మెషీన్లు వాడరు. తమ సొంత ఇంజనీర్లు తయారు చేసిన 18 స్పీకర్ల ఆడియో సిస్టమ్ వాడతారు. దాన్ని కూడా ఒకో కారుకు తగినట్టు (లోపల ఏ లెదర్ ఎంత వాడారు, ఏ చెక్క ఎంత వాడారు అన్న దాన్ని బట్టి) ప్రత్యేకంగా ట్యూన్ చేస్తారు. సంగీతంలో ఎలాంటి అసంభావ్యవస్థ (latency) ఉండకూడదని 25 మీటర్ల ఆప్టికల్ ఫైబర్ మాత్రమే వాడతారు. రోల్స్ రాయిస్ కార్ల టైర్లపై ఉన్న సంస్థ లోగో ఎప్పుడూ నిలువుగానే ఉంటుంది (టైరు తిరుగుతున్నా).
ఇంజన్ ఎంత అభివృద్ధి చెందినదంటే మూడు టన్నులు బరువైన ఫ్యాంటమ్ కారు 0 నుండి 100కి.మీ వేగాన్ని 5 సెకన్లలో అందుకుంటుంది. ఇవీ ఆ కార్లు అంత ధర ఉండేందుకు గల కారణాల్లో కొన్ని. కొన్నేళ్ళ క్రితం ఓ కస్టమర్ కోరికపై సంస్థ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుండి ఇద్దరు నేత నిపుణులను పిలిపించి, వెదురు, పట్టుతో అద్భుతమైన upholstery, పెయింటు డిజైన్ తయారు చేశారు.