ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌పై గీతలు పడితే ఎవరికి మాత్రం బాధ కలగదు చెప్పండి. డివైస్ తెరపై చిన్న గీత పడినా చాలు మనస్సు చివుక్కుమంటుంది. ఈ క్రమంలో ఒకింత విచారం కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడు అలా విచారించాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతోనే మొబైల్ స్క్రీన్‌పై పడిన గీతలను తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్ సహాయంతో మొబైల్ స్ర్కీన్‌పై పడిన గీతలను సులభంగా తొలగించవచ్చు. ఒక మెత్తని కాటన్ క్లాత్‌ను తీసుకుని దానిపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాయాలి. ఆ పేస్ట్‌ను డివైస్ తెరపై అంతటా అప్లై చేయాలి. అనంతరం మళ్లీ ఓ పొడి కాటన్ క్లాత్‌ను తీసుకుని స్క్రీన్‌ను శుభ్రం చేయాలి. దీంతో స్క్రీన్‌పై పడిన స్క్రాచ్‌లు, గీతలు పోతాయి.
బేకింగ్ సోడా కూడా స్క్రాచ్‌లను తొలగించడంలో బాగానే పనిచేస్తుంది. సింపుల్‌గా కొంత బేకింగ్ సోడాను తీసుకుని అందులో కొంత నీటిని కలిపి మెత్తని, చిక్కని పేస్ట్‌లా తయారు చేయాలి. అనంతరం పైన చెప్పిన విధంగా డివైస్ స్క్రీన్‌ను క్లీన్ చేస్తే చాలు. కొన్ని చుక్కల వెజిటబుల్ ఆయిల్‌ను తీసుకుని ఆ డ్రాప్స్‌ను ఒక కాటన్ క్లాత్ సహాయంతో డివైస్ స్క్రీన్‌పై రాయాలి. మళ్లీ పొడి క్లాత్‌తో స్క్రీన్‌ను శుభ్రం చేయాలి. దీంతో స్క్రాచ్‌లు తొలగిపోతాయి. అయితే ఈ ఆయిల్‌ను మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు. లేదంటే స్క్రీన్‌పైనంతా జిడ్డు జిడ్డుగా మారుతుంది.
శరీరానికి రాసుకునే వాజలిన్ కూడా పైన చెప్పిన వెజిటబుల్ ఆయిల్‌లాగే పనిచేస్తుంది. విధానం కూడా సేమ్ అంతే. ఇది కూడా డివైస్ స్క్రీన్‌పై పడిన గీతలను తొలగిస్తుంది. పిల్లలు వాడే ఎరేజర్‌తో కూడా మొబైల్ స్క్రీన్ గీతలను, స్క్రాచ్‌లను తొలగించుకోవచ్చు. కొంత తడిగా ఉన్న కాటన్ క్లాత్‌ను తీసుకుని డివైస్ స్క్రీన్‌పై తుడవాలి. అది ఆరిపోగానే ఎరేజర్‌తో సున్నితంగా గీతలను చెరిపివేసినట్టు రాయాలి. దీంతో ఆ గీతలు తొలగిపోతాయి.