సాధరణంగా చెప్పులను కొనేందుకు ఓ సమయం అంటు లేకుండా మనకు వీలు ఉన్నపుడు, లేదా కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు కొంటుంటాం. కానీ.. వైద్య నిపుణులు మాత్రం చెప్పులను కేవలం మధ్యాహ్నమే కొనాలని సూచిస్తున్నారు. దుస్తులను కొనేటప్పుడు ఎంత నిక్కచ్చిగా ఉంటామో.. చెప్పుల విషయంలోనే అలాగే ఉండాలని, లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మనం ఇంట్లో నుంచి ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చే వరకు మన పాదాలకు రక్షణ ఇచ్చేవి చెప్పులే.పాదరక్షలు కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. సర్జరీలు, డయాబెటిస్ రోగులు కచ్చితంగా మధ్యాహ్నమే లేదా సాయంత్రం మధ్యవేళలోనే పాదరక్షలు కొనాలని సూచిస్తున్నారు.
బీపీ, షుగర్, డయాబెటిస్, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి కాళ్లు వాపుగా ఉంటాయి. వీరితో పాటు విధుల్లో భాగంగా ఎక్కువసేపు కుర్చీల్లో కూర్చొని పని చేస్తుండటంతో కండరాల్లో కదలిక లేకపోవడంతో కాళ్లు వాస్తాయి. ఇలాంటి వారికి మధ్యాహ్నం 2– 3 గంటల సమయంలో వాపుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో పాదరక్షలు కొంటే సాధరణ సైజ్ కన్న కాస్త పెద్ద సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని మరీ పెద్ద సైజ్ తీసుకుంటే మామూలు సమయంలో మరీ వదులవుతాయి. విధుల నిర్వహణలో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులైనా, బూట్లు అయినా సరైన సైజ్ ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
మామూలు సమయంలో చెప్పులు పాదరక్షలు కొంటే కాళ్లకు తగ్గ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం అయ్యే సరికి పనివేళలో ఉన్నప్పుడు కాళ్ల వాపు వస్తుంది. అప్పుడు చెప్పులు బిగుసుకుపోతాయి. దీంతో పాదాలకు పగుళ్లు వచ్చి అవి దీర్ఘకాలికంగా తగ్గవు. కాళ్లకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. బూట్లు వేసుకున్నప్పుడు గోర్ల పెరుగుదల మందగించి, గోటి చివర్లు వేళ్లలోకి గుచ్చుకొని ఇన్‌ఫెక్షన్లకు గురై తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మడమల సమస్యలు, కాళ్లు బెణకడం, నడకలో కూడా మార్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక్కకాలికి మాత్రమే ట్రయల్ చేస్తుంటాం. అలా కాకుండా రెండు కాళ్లకు వేసుకుని సౌకర్యవంతంగా అనిపిస్తేనే తీసుకోవాలని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు.