రామప్ప ఆలయాన్ని సుమారు 300 మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతో పాటు కాటేశ్వరాలయం, నందిమండపం, శిలశాసనంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఎలాంటి విద్యుత్‌కాంతులు లేకుండా విరాజిల్లే రుద్రేశ్వరుడు, శివుడికి ఇష్టమైన త్రయోదశికి సూచనగా సూదిమొన పట్టే 13 రంధ్రాలతో చెక్కిన శిల్పం, సరిగమలు పలికే పొన్నచెట్టు, ముగ్గురికి నాలుగు కాళ్లే ఉండే శిల్పాలు రామప్పలో చూపరులను కట్టిపడేస్తాయి. అంతేకాకుండా నాట్యమండపంపై పురాణ ఇతిహాసాలు ప్రతిబం బించే శిల్పాలు, గజాసుర సంహరణ, క్షీరసాగరమథనం దృశ్యాలను వివరించే శిల్పాలు కనువిందు చేస్తాయి. మరో విశేషమేమిటంటే సాధారణంగా ఏ ఆలయాన్నైనా అందులో ఉండే మూలవిరాట్ పేరుతో లేదా నిర్మించిన వారి పేరుతో పిలుస్తాం. కానీ రామప్ప అనే శిల్పి కళానైపుణ్యానికి నిదర్శనంగా ఆలయానికి ఆయన పేరే పెట్టడం దేశంలో ఉన్న ఏకైక కట్టడం ఇదే కావచ్చు. నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం..
1213 సంవత్సరంలో కేవలం ఇసుకను పునాదిగా చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడం కోసం 3 మీటర్ల మట్టిని తీసి అందులో ఇసుక నింపారు. ఇసుకను పునాదిగా మార్చి ఒక్కో శిల్పాన్ని పేరుస్తూ వెళ్లారు. పునాది బలంగా ఉండేందుకు, కృంగినా కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా 10-12 అంగుళాల బీమ్‌లు వాడారు. ఆలయ నిర్మాణం కోసం శాండ్‌స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లు ఉపయోగించారు. 17వ శతాబ్దంలో భూకంపం వచ్చి రామప్ప ఆలయంలోని కళ్యాణ మండపానికి సంబంధించిన 4 బీములు మధ్యలోకి విరిగిపోయినా శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడడం వల్లే ఆలయం చెక్కు చెదరలేదని పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కాకతీయుల కాలంలోనే ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని చెప్పొచ్చు. ఆలయ నిర్మాణానికి రాతిని ఉపయోగించి ఆలయంపై ఎలాంటి బరువు ఉండొద్దనే ఉద్దేశంతో గర్భగుడిపై గోపురానికి కేవలం నీటిలో వేస్తే తేలాడే ఇటుకలను వాడారు. సాధారణంగా ఇటుకల సాంద్రత(డెన్సిటీ) 2.2 ఉంటుంది. ఈ ఇటుకలు నీటిలో మునిగిపోతాయి. దీంతో శిల్పి ఆలయ గోపుర నిర్మాణం కోసం 0.8 0.9 సాంద్రత(డెన్సిటీ) ఉన్న ఇటుకలను వాడారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే సుమారు మూడురెట్లు తక్కువ బరువు ఉండగా.. ఇలాంటి ఇటుకలతో కట్టిన ఆలయం దేశంలోనే రామప్ప ఒకటే.
ఈ ఆలయ నిర్మాణం కోసం శాండ్‌స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్‌కు చెందిన మూడు రకాల రాళ్లను వాడినట్లు యునెస్కోకు నివేదించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా పిల్లర్లు, పైకప్పుకు శాండ్‌స్టోన్, ఆలయ బీములకు డోలరైట్, ఆలయంలోని శిల్పాలకు, నల్లరాతి స్తంభాలు గల మండపానికి, గర్భగుడి ముఖద్వారం ఇరుప్రక్కల ఉన్న పేరిణి నృత్య భంగిమలకు బ్లాక్ గ్రానైట్‌ను వాడారు. శాండ్‌స్టోన్ రాయిపై చెక్కిన నృత్య భంగిమల శిల్పాలు అద్దం అంత నునువుగా ఉంటూ నేటికి చెక్కు చెదరలేదు. అంతేకాకుండా శాండ్‌స్టోన్‌తో చేసిన ఒక శిల్పంలో రెండు రంగులు కలిగి ఉండడం మరో ప్రత్యేకత. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నా నేటికి దాని గొప్పతనాకి రావల్సిన కీర్తిచంద్రికలు రాకపోవడం విచారించదగ్గ అంశం. ఇప్పుడైనా దీని సాంకేతికను,శిల్ప సంపదను భద్రం చేసి రాబోవు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.