Goat Milk : పాలు మన నిత్య జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం చాలా మంది పాలను వాడుతుంటారు. పాలలో అధిక పోషకాలు ఉన్న కారణంగా అవి మనకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్నాయి. పాలలో ఉండే కాల్షియం, కొవ్వులు మనకు ఎంతగానో అవసరం. పాలను తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
ప్రస్తుతం మనకు తాగేందుకు చాలా రకాల పాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది గేదె పాలు, ఆవు పాలను తాగుతుంటారు. కానీ మేక పాలు కూడా మంచివేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆవు, గేదె పాలను తాగలేని వారు మేక పాలను తాగవచ్చని చెబుతున్నారు.
ఇతర ఏ పాలు అయినా సరే కొందరికి పడవు. అసిడిటీని, అలర్జీలను కలిగిస్తాయి. అలాంటి వారు మేకపాలను తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇతర పాలతో పోలిస్తే మేక పాలలో చక్కెర తక్కువగా ఉంటుంది. అందువల్ల మేక పాలు ఆరోగ్యకరమైనవని అంటున్నారు.
ఇతర పాలతో పోలిస్తే మేక పాలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. అందువల్ల అన్ని వయస్సుల వారు వీటిని తాగవచ్చు. మేక పాలను తాగడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. రక్తంలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య పెరుగుతుంది. డెంగ్యూ వచ్చి కోలుకుంటున్న వారికి మేక పాలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
కామెర్లతో బాధపడుతున్నవారికి కొన్ని చోట్ల రోజూ మేక పాలను ఇస్తారు. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరిగి కామెర్లు తగ్గుతాయి. కామెర్ల నుంచి త్వరగా కోలుకుంటారు.
ఆవు పాలను తాగితే కొన్ని రకాల పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. కానీ మేక పాలు అలా కాదు. మనం తినే ఆహారాల్లో ఉండే అన్ని పోషకాలను శరీరం శోషించుకుంటుంది. అందువల్ల శరీర ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
మేక పాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణాశయ వాపులను తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి మేకపాలు ఎంతో మేలు చేస్తాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉన్నవారు మేక పాలను తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మేక పాలలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఐరన్, ఇతర అవసరమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ పాలను పోషకాలకు గనిగా చెబుతారు. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. మేక పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎదిగే చిన్నారులకు ఎంతగానో మేలు చేస్తుంది.
ఒక కప్పు మేక పాలను తాగడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. 168 క్యాలరీలు వస్తాయి. ప్రోటీన్లు 9 గ్రాములు, కొవ్వులు 10 గ్రాములు, కార్బొహైడ్రేట్లు 11 గ్రాములు, షుగర్ 11 గ్రాములు, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు లభిస్తాయి. మేక పాలలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.