టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కోవై సరళ. గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతోమంది స్టార్ కమెడియన్స్ కి పోటీ ఇచ్చిన ఫిమేల్ కమెడియన్ కోవై సరళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె పుట్టింది తమిళనాడులో అయినా.. తెలుగు సినిమాలలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం – కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వని వారంటూ ఉండరు. కోవై సరళ తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు 700 సినిమాల్లో నటించారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో సక్సెస్ అయిన కోవై సరళ వ్యక్తిగత జీవితంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకున్న కోవై సరళ తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడమే మర్చిపోయారు. కోవై సరళ ఇంటికి పెద్ద కూతురు కావడంతో తన తోబుట్టువుల బాధ్యతను తీసుకొని వారిని చదివించి వారికి ఓ మంచి జీవితాన్ని ప్రసాదించింది. ప్రస్తుతం ఆమె తోబుట్టువులు ఇతర దేశాలలో స్థిరపడ్డారు. వారికోసం ఈమె పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని ముందుకు నడిపించింది. అలా కుటుంబం కోసం తన జీవితాన్ని ధారబోసింది కోవై సరళ. అయితే ఈమెకు ప్రస్తుతం వయసు పై పడడంతో అవకాశాలు తగ్గడంతో పాటు తనని పలకరించే వారు కూడా లేరు.
ఎవరికైతే ఈమె తన జీవితాన్ని త్యాగం చేసిందో వాళ్లు కూడా తనని పట్టించుకోవడం లేదట. ఇక కోవై సరళ చివరిగా 2019లో వచ్చిన అభినేత్రి 2 సినిమాలో నటించారు. ఆ తర్వాత ఈమె కొంత కాలం పాటు విరామం తీసుకుని మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె నటించిన తమిళ చిత్రం సెంబి. ఇందులో కోవై సరళ సరికొత్త మేకోవర్ తో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. ఈ మూవీ అందరిచే ప్రశంసలను కూడా అందుకుంది.