క్యాన్సర్… నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భయ పెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. కారణాలు ఏమున్నా నేడు క్యాన్సర్ అనేక రకాలుగా మనకు వ్యాప్తి చెందుతోంది. బ్లడ్ క్యాన్సర్, బోన్, బ్రెస్ట్, థైరాయిడ్, ప్రోస్టేట్, మౌత్, లంగ్… ఇలా అనేక భాగాల్లో క్యాన్సర్ వస్తోంది. అయితే ఇలా వచ్చే క్యాన్సర్‌లకు ముందుగానే మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. దీంతో క్యాన్సర్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆయా రకాల క్యాన్సర్లు వచ్చేందుకు ముందుగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లంగ్, థ్రోట్, థైరాయిడ్ వంటి క్యాన్సర్‌లు వస్తే దగ్గు ఎక్కువగా వస్తుంది. సాధారణ దగ్గు అయితే త్వరగా తగ్గిపోతుంది. అదే దగ్గు కొన్ని వారాల పాటు ఉందంటే అనుమానించాల్సిందే.
అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ వారానికి 4.5 కిలోలకు పైగా బరువు కోల్పోతుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఛాతిలో వాపులు, గడ్డలు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉంటే ఛాతి భాగం అసాధారణ ఆకృతిలో కనిపిస్తుంది. మూత్రం, మలం సాధారణ రంగు, వాసన కాకుండా విభిన్నంగా కనిపించినా, అలా ఎక్కువ రోజుల పాటు లక్షణాలు ఉన్నా దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. చంకలు, మెడ వంటి భాగాల్లో లింఫ్ గ్రంథులు ఉంటాయి. దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు కలిగినప్పుడు ఇవి వాపులకు గురవుతాయి. అయితే ఈ వాపులు రెండు వారాలకు పైగా అలాగే ఉంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి.
చర్మంపై అసాధారణ రీతిలో ఏవైనా పెరగడం, మచ్చలు, మరకల వంటివి రావడం, ఆకృతిలో మార్పు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. నాలుక లేదా నోట్లో ఎరుపు, తెలుపు రంగుల్లో ప్యాచ్‌ల లాంటి మచ్చలు వచ్చి ఎక్కువ రోజుల పాటు ఉంటే వాటిని క్యాన్సర్‌గా అనుమానించాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు అలసిపోవడం సహజం. అయితే అలా కాకుండా ఏ పనిచేయకున్నా తీవ్రంగా అలసట వస్తుంటే అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని తెలుసుకోవాలి. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారికి కడుపు ఉబ్బరం అప్పుడప్పుడు వస్తుంటుంది. అయితే అలా కాకుండా ఈ సమస్య తరచూ వస్తున్నా దాన్ని క్యాన్సర్‌గా గుర్తించాల్సిందే. ప్రధానంగా మహిళల్లో అండాశయ క్యాన్సర్ ఉంటే ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.
పురుషుల్లో వెన్ను నొప్పి ఎక్కువగా వచ్చేవారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ నొప్పి కొలన్, ప్రోస్టేట్ క్యాన్సర్‌లకు సంబంధించింది అయి ఉండవచ్చు. రుతు సమయంలో కాకుండా మహిళలకు ఇతర సమయాల్లో రక్త స్రావడం అవడం, క్లాట్‌తో కూడిన రక్తం వస్తుంటే దాన్ని సర్వికల్ క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి. ప్రోస్టేట్, టెస్టికల్ క్యాన్సర్ వచ్చే పురుషుల గజ్జల్లో ఎక్కువగా గడ్డలు వస్తుంటాయి. వీటిని గుర్తించడం ద్వారా క్యాన్సర్ వస్తుందో రాదో తెలుసుకోవచ్చు. అయితే ఒక్కోసారి ఇలాంటి గడ్డలు రాత్రికి రాత్రే వస్తుంటాయి. అండాశయ క్యాన్సర్ వచ్చిన మహిళలకు కడుపు ఉబ్బరమే కాకుండా కడుపు నొప్పి కూడా తరచూ వస్తుంటుంది. కాబట్టి ఈ లక్షణం ఎక్కువ రోజుల పాటు ఉందంటే దాన్ని క్యాన్సర్‌కు హెచ్చరికలా భావించాలి. అయితే పురుషులకు వెన్నెముక కాకుండా గజ్జలు, తొడల్లో నొప్పి ఎక్కువగా వస్తున్నా దాన్ని క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి.