నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం… ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు ఎన్నో రకాల సందర్భాల్లో ఒత్తిళ్లు… దానికి తోడు రోజూ ఉండే వివిధ సమస్యలు… వీటన్నింటికీ తోడు చేతిలో స్మార్ట్‌ఫోన్… ఇవీ నేడు మనిషి నిద్ర లేమికి కారణాలవుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి 1, 2 గంటలు అయ్యే వరకు దాదాపుగా చాలా మంది నిద్రపోవడం లేదు. ఆ తరువాతే పడకెక్కుతున్నారు. దీంతో తెల్లవారుజామున కూడా ఆలస్యంగా లేస్తున్నారు. కానీ అలా ఉదయాన్నే ఆలస్యంగా లేచే వారు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదట, ఎన్నో విజయావకాశాలను కోల్పోతారట. అవును, మీరు విన్నది నిజమే. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనిషి నిత్యం కష్టపడడమే కాదు, సరైన సమయానికి నిద్రపోయి, సరైన సమయానికి నిద్ర లేవాలట. అలాంటి వారే జీవితంలో ఎన్నో విజయావకాశాలను అందిపుచ్చుకుంటారట. ఆలస్యంగా నిద్రలేవడం అంటే ఉపయోగకరం అయిన ఎన్నో పనిగంటలను కోల్పోయినట్టేనని శాస్త్రవేత్తలు తేల్చేశారు.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తారట. అందుకే వారు అంతటి గొప్ప స్థానాలను పొందారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలలో కొందరు ఉదయాన్నే ఎన్ని గంటలకు నిద్రలేస్తారో, ఏమేం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం… జాక్ మా, ఆలీబాబా గ్రూప్ ఫౌండర్.. ఈయన ఉదయం 6-7 గంటలకే నిద్ర లేస్తారట. అంతేకాదు, ఆ సమయం నుంచే పనిలో నిమగ్నమవుతాడట. జెఫ్ బెజోస్, అమెజాన్ సీఈవో.. రోజు మొత్తం ఆఫీసులో కేవలం పని చేసేందుకే ఆయన అధిక ప్రాధాన్యతను ఇస్తాడట. ఇక రాత్రవుతుందంటే ఎంత పని ఉన్నా పక్కన పడేసి ముందు నిద్ర పోతాడట. అలా పెందలాడే పడుకుని మళ్లీ ఉదయాన్నే నిద్ర లేచి పని ప్రారంభిస్తాడట ఈయన.
టిమ్ కుక్, యాపిల్ సీఈవో.. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఉదయాన్నే 4.30 గంటలకు నిద్ర లేస్తాడు. లేచీ లేవగానే మెయిల్స్ చేసుకుంటాడు. అనంతరం జిమ్, ఆ తరువాత బ్రేక్‌ఫాస్ట్, ఆఫీస్. అలా అందరికన్నా ముందుగానే ఆయన ఆఫీసుకు వెళ్లి అందరూ వెళ్లాకనే తిరిగి ఇంటికి చేరుకుంటాడు. బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్.. ఈయన కూడా ఉదయాన్నే నిద్రలేస్తారు. గంట సేపు ట్రెడ్ మిల్ మీద వర్కవుట్ చేస్తాడు. దానిపై నుంచే ఆఫీస్ పని ప్రారంభిస్తాడు. మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్‌బుక్ సీఈవో.. ఉరుములు మెరుపులు మీద పడినా జుకర్‌బర్గ్ మాత్రం ఆగడు. ఉదయాన్నే 6 గంటల కల్లా లేచి వెంటనే పనులు ముగించుకుని ఆఫీసుకు వెళ్తాడు. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఉదయాన లేవడం మాత్రం ఆపడు. వారెన్ బఫెట్, బెర్క్ షైర్ హాత్‌వే సీఈవో.. ఉదయాన 6.45 నిద్రలేస్తాడు. షెడ్యూల్ ఏమీ లేకపోతే 6 న్యూస్ పేపర్లు చదువుతాడు. రోజు మొత్తంలో 80 శాతం సమయాన్ని చదవడానికే కేటాయిస్తాడు.
రతన్ టాటా, టాటా సన్స్ మాజీ చైర్మన్.. రాత్రి ఎంత ఆలస్యమైనా ఉదయాన 6 గంటలకు నిద్రలేచేవారు. వెంటనే ఆఫీసే పని ప్రారంభించేవారు. వీకెండ్స్‌లో సొంతంగా కార్ లేదంటే జెట్ నడిపే అలవాటు ఆయనకు ఉండేది. ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్.. ఉదయం 5, 5.30 మధ్యలో నిద్ర లేస్తాడు. జిమ్‌లో వర్కవుట్ చేశాక స్విమ్మింగ్ చేసి న్యూస్ పేపర్లు చదివి ఆఫీస్ పని మొదలు పెట్టేస్తాడు. ఓఫ్రా విన్‌ఫ్రే, ప్రముఖ టీవీ యాంకర్.. ఉదయాన్నే 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తుంది. అనంతరం జిమ్‌లో వ్యాయామం. ఆ తరువాతే పని చేస్తుంది. నరేంద్ర మోడీ, భారత ప్రధాని.. ఉదయం 5 గంటల కల్లా మోడీ నిద్ర లేస్తారు. ప్రాణాయామం, సూర్క నమస్కారాలు, యోగా చేశాక దినచర్య ప్రారంభమవుతుంది. విరాట్ కోహ్లి, భారత క్రికెటర్.. కోహ్లి ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాడు. అనేక రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తాడు. కండలు పెరిగేందుకు బరువులు బాగా ఎత్తుతాడు. అనంతరం క్రికెట్ ప్రాక్టీస్ షురూ అవుతుంది.