రోజూ నిద్ర లేవగానే ఎవరైనా ఏం చేస్తారు..? ఏం చేస్తారు..? బాత్‌రూంలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటారు. అది ఆరోగ్యవంతులైతే. మరి బాత్‌రూంలోనే కాలకృత్యాలు తీరక కుస్తీలు పట్టే వారు..? అదేనండీ, మలబద్దకం ఉన్నవారు. ఆ… అవును, వారే..! వారైతే విరేచనం సాఫీగా జరగక ఆ భారంతోనే బయటికి వచ్చి రోజంతా గడిపేస్తారు. మరుసటి రోజు షరా మామూలే. ఈ క్రమంలో మలబద్దకం కాస్తా ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుంది. కానీ దాన్ని తొలగించుకునే మార్గం గురించి చాలా మంది పట్టించుకోరు. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను పాటిస్తే మలబద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ వేడి పాలను తాగడం వల్ల మరుసటి రోజు ఉదయాన్నే మల విసర్జన సాఫీగా జరుగుతుంది. అయితే పాలలో కొద్దిగా ఆముదం కలుపుకుని తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. రోజుకు 3 సార్లు ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. ఎండు ద్రాక్ష (కిస్మిస్) పండ్లను ఎక్కువగా తింటున్నా మలబద్దక సమస్య నుంచి బయట పడవచ్చు. ఇవి జీర్ణక్రియ సాఫీగా అయ్యేలా చూస్తాయి. రాత్రి పూట భోజనంలో అన్నం కాకుండా గోధుమ పిండితో చేసిన చపాతీలు తిన్నా మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దక సమస్య పోతుంది.
రాత్రి పూట భోజనం చేసిన తరువాత కొంత సేపటికి పైనాపిల్‌ను తింటే జీర్ణక్రియ సరిగ్గా జరిగి మరుసటి రోజు ఉదయం విరేచనం సులభంగా జరుగుతుంది. మలబద్దకం కూడా తొలగిపోతుంది. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలను పొడి చేసి వాటన్నింటినీ కలిపి తయారు చేసే త్రిఫలా చూర్ణాన్ని రాత్రి పూట తీసుకుంటుంటే మలబద్దక సమస్య పోతుంది. అరటి పండు తొక్కను తిన్నా మలబద్దకం సమస్యను తొలగించుకోవచ్చు. రాత్రి పూట భోజనంతోపాటు ఒక టీస్పూన్ కరివేపాకు పొడిని తీసుకుంటే మలబద్దకం పోతుంది. కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి రాత్రి సమయంలో తీసుకుంటున్నా మలబద్దకాన్ని వదిలించుకోవచ్చు. రాత్రి పూట ఒక రాగి చెంబులో నీటిని ఉంచి తెల్లవారగానే ఆ నీటిని తాగితే విరేచనం సులభంగా జరుగుతుంది.