మనీపర్సు రైలులో పర్సుపోయింది. అక్కడా ఇక్కడా వెదికాడతను. ఎక్కడా దొరకలేదు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు. బాత్రూంకి వెళ్ళినప్పుడు పర్సు ఉంది. తిరిగొచ్చినప్పుడు పర్సు ఉంది. వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసే డబ్బులిచ్చాడు. చిల్లరతీసుకుని జాగ్రతచేశాడు కూడ. మరెక్కడ పారేసుకున్నట్టు? అంతుచిక్కలేదతనికి. కాశీకి వెళ్తూ ఈ పర్సు గోలేమిటి? పోతే పోయింది. రానూ పోనూ టిక్కెట్లు ఫోన్లో ఉన్నాయి. ఓ వెయ్యిరూపాయలు పైబడి ఫోన్ పేలో ఉంది. చాలనుకున్నాడు. అబ్బాయిని ఓ అయిదువేలు అడుగుదాం అనుకున్నాడుకాని, ఏమిటో అడగబుద్ధికాలేదు. మొన్ననే మందులికి అయిదువేలిచ్చాడు. కాశీకి అంటే టిక్కెట్లు తీసిచ్చాడు. ఇంకా ఎంతకని? అందుకనే అడగలేదు. అన్నదానసత్రాలు చాలా ఉన్నాయి కాశీలో. ఇంత అన్నం పెడతారు. తిని ఏ గుడిముంగిట పడుకున్నా అయిపోతుంది. మూడురోజులు గిర్రున తిరిగిపోతాయి. నాలుగోనాడు తిరుగుప్రయాణం అనుకున్నాడతను.
అంతలో ఎవరో స్త్రీ పెద్దగొంతుతో అడిగిందిలా. ఈ పర్సు ఎవరిదండీ? నాకు దొరికింది. తేరుకుని, ఆమె చేతిలోని పర్సును చూశాడతను. ఆ పర్సు తనదే! నాదే మేడం..’ అన్నాడు. ఋజువు ఏమిటి? అడిగిందామె. అందులో రెండు వందనోట్లూ, ఓ యాభైనోటూ, ఇంకా కొంత చిల్లరా ఉంటుంది. అలాగే మా మనవరాలు ఫోటో ఉంటుంది అందులో.. చెప్పాడతను. ఫోటో వెనుక మా ముద్దులమనవరాలు మాధురి అని రాసి ఉంటుంది.. అన్నాడు. పర్సులోని ఫోటో తీసి, చూసిందామె. అతను చెప్పినట్టుగానే రాసి ఉంది. పర్సు ఇచ్చివేసిందతనికి. వచ్చి ఎదురుగా కూర్చుంది. కబుర్లు మొదలెట్టింది. చాలా పాత పర్సు, ఎప్పుడుకొన్నారు?
కొనలేదు. గిఫ్ట్ గా వచ్చింది. నేను ఎనిమిదివ తరగతి పాసైనప్పుడు మా నాన్నగారు దీనిని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. చెప్పాడతను. పర్సులో ఫోటోలుపెట్టుకోవడం ఎప్పటినుంచి అలవాటు? నాన్న ఇచ్చినప్పటినుంచే అలవాటు. అప్పట్లో మా అమ్మగారి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత? డిగ్రీ చదువుతున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకున్నాను. ఆ తర్వాత? నాకు పెళ్ళయింది. మా ఆవిడ ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు మనవరాలు ఫోటో పెట్టుకున్నారు. అంతేనా? అడిగిందామె. పర్సులో ఎప్పుడూ లేడీస్ ఫోటోసేతప్ప జెంట్స్ ఫోటోస్ పెట్టుకోరేం! కారణం? అడిగింది. సమాధానం చెప్పలేదతను. నవ్వి ఊరుకున్నాడు. నాన్న కొనిచ్చిన పర్సు, కాని నాన్నకి అందులో చోటులేదు. చిత్రంగా లేదూ? నవ్విందామె.
అబ్బాయిఫోన్ చేశాడింతలో. స్పీకర్లో పెట్టి వినసాగాడతను. నాన్నా! ఆఫీసు మీటింగ్ లోపడి నీ సంగతే మరచిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. నీ ఖర్చులకుగాను పదివేలు ఫోన్ పే చేస్తున్నాను. వచ్చిందీ లేందీ చూస్కో. డబ్బులు జమ అయినట్టుగా మేసేజ్ వచ్చింది. మేసేజ్ వచ్చినట్టుగా మ్యూజిక్ వచ్చింది. చూసుకున్నాడతను. ఇప్పుడు కొడుకు పంపించిన పదివేలుసహా మొత్తం పదకొండువేల మూడువందల ఇరవై రూపాయలు ఫోన్ పేలో ఖర్చులకు ఉన్నాయి. చాలు అనుకున్నాడతను. ఆమెవైపు చూశాడు. నాన్నల్ని కొడుకులు గుండెల్లో దాచుకుంటారు మేడం, పర్సుల్లో కాదు. అన్నాడు. స్త్రీని కళ్ళతోకాదు, గుండెతో చూడాలి. అందుకనే గుండెకు దగ్గరగా ఉన్న జేబులో పర్సులో ఆమెను దాచుకుంటాడు మగాడు. అని నవ్వాడతను. రైలు మరింతవేగాన్ని పుంజుకుంది. చాయ్ చాయ్! గరం గరం చాయ్ అంటూ టీ అమ్మకానికి వచ్చింది.