ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది రక రకాలుగా కష్టపడుతుంటారు. అయితే మరీ అంత కష్టపడాల్సిన పనిలేదు. కేవలం కొద్దిపాటి వ్యాయామం చేయడంతోపాటు నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు భోజనం చేయడం, తగినన్ని గంటలపాటు నిద్రించడం చేస్తే చాలు. ఆటోమేటిగ్గా ఎవరైనా ఫిట్‌గా ఉండవచ్చు. ఫిట్‌గా ఉండేందుకు ఏయే అంశాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు
రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని అయినా తాగాలి. నిత్యం ఉదయం నిద్ర లేవగానే కనీసం 1 లీటర్ నీటిని తాగే అలవాటు చేసుకోవాలి.
తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు
తక్కువ కొవ్వు ఉండే పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. వెన్న తీసిన పాలను తాగాలి.
నట్స్
బాదంపప్పు, జీడిపప్పు, పల్లీలు వంటి నట్స్‌ను నిత్యం ఓ గుప్పెడు మోతాదులో తినాలి. అన్నీ కలిపి ఒక గుప్పెడు చొప్పున తింటే చాలు. దీంతో ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఇవి చెడు కొవ్వులను కరిగిస్తాయి. దీంతోపాటు విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మం, జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. పురుషుల్లో సంతాన లోపం సమస్య ఉండదు.
పచ్చి కూరగాయలు
ఉల్లిపాయలు, టమాటాలు, కీరదోస, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికం వంటి కూరగాయలను పచ్చిగా ఉండగానే తినాలి. అయితే పచ్చిగా తింటే సాల్మొనెల్లా బాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. కనుక వాటిని బాగా కడుక్కుని తినాలి. లేదంటే కొద్దిగా ఉడికించి కూడా తినవచ్చు. రోజుకు ఒక్కసారి వీటిని తీసుకోవాలి. దీంతో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
పిండి పదార్థాలను తగ్గించాలి
భారతీయ ఆహార పదార్థాలు అంటేనే పిండి పదార్థాలు (కార్బొ హైడ్రేట్లు) అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. 3 లేదా 4 చపాతీలను లేదా ఒక కప్పు అన్నంను మాత్రమే తినాలి. దీంతో శరీరానికి తగినన్ని కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. అంతకన్నా మించి తీసుకుంటే శరరంలో ఆ పిండి పదార్థాలు కొవ్వులుగా మారుతాయి. దీంతో అధిక బరువు పెరుగుతారు. కనుక పిండి పదార్థాలను చాలా తక్కువ మోతాదులో నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాయామం
పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు నిత్యం వ్యాయామం చేస్తే చాలా త్వరగా బరువు తగ్గుతారు. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా ఫలితం ఉంటుంది.
చిరు ధాన్యాలు
చిరు ధాన్యాలతోపాటు బ్రౌన్ రైస్‌ను తీసుకోవాలి. వీటిల్లో ఉండే ఫైబర్ శరీరానికి మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉండవు. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
జంక్ ఫుడ్
చక్కెర, ఉప్పు మనకు పెద్ద శత్రువులు. అలాగే నూనె పదార్థాలు, జంక్ ఫుడ్. వీటిని అస్సలు తీసుకోకూడదు. లేదా చాలా చాలా తక్కువగా తినాలి.
ప్రోటీన్లు
మన శరీర నిర్మాణానికి, కణజాలం మరమ్మత్తులకు, చర్మం, వెంట్రుకల సంరక్షణకు ప్రోటీన్లు అవసరం. కనుక నిత్యం ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. పప్పు దినుసులు, కాలిఫ్లవర్ వంటి కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, మొలకెత్తిన గింజలు, చికెన్, చేపలు వంటి పదార్థాలను తినవచ్చు. వీటి ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి.
నిద్ర
నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. రాత్రి వీలైనంత త్వరగా నిద్రించాలి. మరుసటి రోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి.
పైన తెలిపిన సూచనలు పాటిస్తే ఎవరైనా ఆరోగ్యం పరంగా చాలా ఫిట్‌గా ఉంటారు.