Japan People : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఒక్కో రకమైన నాగరికత, జీవన విధానం ఉంటాయి. ఇక జపాన్ కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పట్లో జరిగిన అణుబాంబు దాడి నుంచి తేరుకుని ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతోంది. టెక్నాలజీ అనే పేరు చెబితే ముందుగా మనకు జపాన్ గుర్తుకు వస్తుంది. అయితే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నప్పటికీ జపాన్ వాసులే మనకు ఎక్కువగా సన్నగా కనిపిస్తారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జపాన్ లో ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను ఉపయోగిస్తారు. వారు బస్సులు, ట్రైన్లలో రోజూ ప్రయాణిస్తారు. దీంతో ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. వారు దాదాపుగా రోజుకు 2 నుంచి 3 గంటల వరకు నడవడం, ప్రయాణాల్లో గడపడం చేస్తారు. ఇక చాలా మంది కార్లు, బైక్‌లకు బదులుగా సైకిల్స్‌ను ఉపయోగిస్తారు. ఈ అలవాట్ల వల్ల వారు సన్నగా ఉంటున్నారని చెప్పవచ్చు.
జపాన్ పౌరులు కూడా అన్నం తింటారు. కానీ వారు తక్కువ మోతాదులో అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తింటారు. అందువల్ల వారు బరువు పెరగరు. అలాగే రెస్టారెంట్లలోనూ ఒక వ్యక్తి తింటానికి వెళితే.. అతనికి ఎంత కావాలో వారు అంతే సర్వ్ చేస్తారు. మన దగ్గరిలా పెద్ద ప్లేట్‌లో భారీ ఎత్తున వంటకాలను వడ్డించరు. ఇది కూడా వారు సన్నగా ఉండేందుకు ఒక కారణం అని చెప్పవచ్చు.
ఇక జపాన్ లో అధిక బరువు ఉండేవారికి సరైన దుస్తులు లభించవు. దీంతో ఆ భయం వల్ల వారు సన్నగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది వారిని సన్నగా ఉంచుతుంది.
ఇతర దేశాల్లో బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కు పైన ఉంటే స్థూలకాయంగా పరిగణిస్తారు. కానీ జపాన్‌లో మాత్రం బీఎంఐ విలువ 23 ఉంటేనే అధికంగా బరువు ఉన్నట్లు భావిస్తారు. అందువల్ల ఆ విలువ కన్నా తక్కువగా ఉండేందుకు జపాన్ వాసులు ప్రయత్నిస్తారు. దీనివల్ల వారు సహజంగానే బరువు తక్కువగా ఉంటారు. బరువును నియంత్రణలో ఉంచుకుంటారు. కనుక వారు ఎల్లప్పుడూ సన్నగానే కనిపిస్తారు.
జపాన్ వాసులు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. అధిక బరువు ఉండడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు స్పష్టంగా వివరిస్తాయి. అందువల్లే ప్రపంచంలో స్థూలకాయులు అత్యంత తక్కువగా ఉన్న దేశంగా జపాన్ పేరుగాంచింది. జపాన్ వాసులు సన్నగా ఉండేందుకు ఇవన్నీ కారణాలే అని చెప్పవచ్చు. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా జపాన్ పౌరుల ఆయుర్దాయం కూడా ఎక్కువే. వారు పాటించే ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్లే వారు ఎక్కువ సంవత్సరాలు పాటు జీవిస్తున్నారని చెప్పవచ్చు.