బయటికి వెళ్లేటప్పుడు ఎదురుగా నల్ల పిల్లి కనిపిస్తే అశుభం జరుగుతుంది. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో, నాకివాళంతా చెడు జరుగుతుంది. మంగళ, శనివారాల్లో వెంట్రుకలు, గోర్లు కట్ చేయరాదు. సాయంత్రం దాటితే ఇల్లు ఊడ్చరాదు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఇలాంటి నమ్మకాలను పాటించే వారు చాలా మందే ఉంటారు. అయితే ఈ నమ్మకాల విషయానికి వస్తే అవి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో ఆ నమ్మకాలను పాటించే వారు కూడా ఉన్నారు. ఇంతకీ వారు పాటించే ఆ నమ్మకాలు ఏంటో తెలుసా..?
రష్యా… ఆకాశంలో వెళ్లే ఏదైనా పిట్ట మనిషి మీద రెట్ట వేస్తే ఆ వ్యక్తికి బోలెడు ధనం త్వరలో లభిస్తుందని రష్యన్ వాసులు నమ్ముతారు. బంగ్లాదేశ్… నిండుగా నీటితో ఉన్న ఓ గ్లాస్‌ను బయటికి వెళ్లేటప్పుడు చూసి బయటికి వెళితే ఆ రోజున ఆ వ్యక్తికి అంతా మంచే జరుగుతుందని, లక్ కలసి వస్తుందని బంగ్లాదేశ్ వాసులు నమ్ముతారు. చైనా… నూడుల్స్‌ను చైనాలో ఎక్కువగా తింటారని తెలిసిందే. అయితే పొడవైన నూడుల్స్‌ను అలాగే తినాలట. వాటిని స్పూన్‌తో కట్ చేయకుండా నేరుగా అలాగే నోట్లో వేసుకుని తినాలట. దీంతో లక్ కలసి వస్తుందని చైనా వాసులు నమ్ముతారు. డెన్మార్క్… పగిలిన వంట సామగ్రిని డెన్మార్క్ వాసులు ఇంట్లో ఉంచరట. ఎందుకంటే అలాంటి సామగ్రి ఇంట్లో ఉంటే చెడు జరుగుతుందని, దుష్ట శక్తులు పీడిస్తాయని వారు నమ్ముతారు.
ఫ్రాన్స్… కుక్క మలాన్ని ఎడమ కాలితో తొక్కితే ధనం లభిస్తుందని, ఐశ్వర్యం కలుగుతుందని, లక్ కలసి వస్తుందని, అంతా మంచే జరుగుతుందని ఫ్రాన్స్ వాసులు నమ్ముతారు. అదే దాన్ని కుడి కాలితో తొక్కితే అలాంటి వారికి అంతా చెడే జరుగుతుందట. ఏది చేసినా కలసి రాదట. జర్మనీ… నల్లపిల్లి ఎదురైతే మనం అశుభం అని అనుకుంటాం. కానీ జర్మనీ వాసులు అలా కాదు. వ్యక్తి ఎదురుగా ఉన్న పిల్లి కుడి నుంచి ఎడమకు వెళితే వారు మంచి జరుగుతుందని నమ్ముతారు. అదే ఆ పిల్లి వ్యక్తి ఎదుట ఎడమ నుంచి కుడికి వెళ్తే మాత్రం చెడు జరుగుతుందని నమ్ముతారు. గ్రీస్… ఎవరైనా తుమ్మితే అవతల ఎక్కడో దూరంలో ఉన్నవారు వారి గురించి తలచుకుంటూ ఉంటారని గ్రీస్ వాసులు నమ్ముతారు. జపాన్… రాత్రి పూట జపనీయులు అద్దంలో చూసుకోరు. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మలు అద్దంలో ఉంటాయని, వాటిలోకి చూస్తే ఆ ఆత్మలు వ్యక్తిలోకి ప్రవేశించి అంతా నష్టం కలగజేస్తాయని వారు నమ్ముతారు. అందుకే వారు రాత్రిపూట అద్దం చూసుకోరు.
పాకిస్థాన్… పాలు లేదా దాని సంబంధ ఉత్పత్తులైన పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ, కోవా వంటివి తిన్నాక వెంటనే చేపలను తింటే అంద విహీనంగా మారుతారని పాకిస్థానీయులు నమ్ముతారు. అలా అందవిహీనం ఒకసారి అయితే ఇక జీవితాంతం అది అలాగే ఉంటుందని, పోదని వారు విశ్వసిస్తారు.