ఆధునిక జీవితంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఉబకాయం, స్థూలకాయ సమస్యలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైనది గురక. నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలామందిలో ఉంటుంది. అందరి ఇళ్లలో ఎవరో ఒకరు గురక సమస్యతో బాధపడుతుంటారు. గురక పెడుతున్న విషయం కుటుంబ సభ్యులు చెప్పేంతవరకు వారు తెలుసుకోలేరు. వారి గురక కారణంగా పక్కన వారికి నిద్ర కరువు అవుతుంది. దీన్ని అధిగమించడానికి ఈ సూచనలను పాటించడం వల్ల గురకపెట్టడాన్ని తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రకరకాల మానసిక ఒత్తిళ్లు, సమస్యలతో నిద్ర మాత్రలు వాడేవారు, మత్తు పానీయాలు వాడేవారు, ధూమపాన ప్రియులు ఎక్కువగా గురక బారిన పడుతుంటారు. నాసిక రంధ్రాలు సరిగా పనిచేయకపోయినా, జలుబుతో బాధపడుతున్నా, టన్సిల్స్ వాపు ఉన్నా కూడా గురక రావచ్చు.
అంతేకాదు గురక పెట్టే వారికి నిద్రలేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇదిలా ఉంటే సాధారణంగా కొందరు రాత్రుళ్ళు ఒక పెగ్గు వేయనిదే నిద్రపోరు. అయితే గురక రావడానికి మద్యం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి నిద్రించే ముందు మద్యానికి వీలైన అంతవరకు దూరంగా ఉండాలి. అలాగే జలుబు చేసినప్పుడు కూడా ముక్కు క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల గురక పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మొదట ముక్కును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అధిక బరువు కూడా గురకకు ఒక కారణం. ఈ గురక సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే.. అరటిపండు, పైనాపిల్, కమలాపండ్లు .. ప్రశాంతమైన నిద్ర, గురక సమస్యను తగ్గిస్తుంది.
శరీరంలో మెలటోనిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి అయితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే రాత్రులు నిద్రించే ముందు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే గురకరాకుండా ఉంటుంది. లేదా రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక వెల్లకిలా పడుకున్నప్పుడు గురక అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని నిద్రించే సమయంలో పక్కకు తిరిగి పడుకోవాలి. యోగ, ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల గురక సమస్యను దూరం చేసుకోవచ్చు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా గురక సమస్య దూరం అవుతుంది.