Sprouts : మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మనకు ఎంతో శక్తి లభిస్తుంది. అలాగే కండరాల నిర్మాణం జరుగుతుంది. దీంతోపాటు మొలకెత్తిన విత్తనాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వల్ల పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు. అయితే మొలకెత్తిన విత్తనాలను రోజులో ఏ సమయంలో తినాలో చాలా మందికి తెలియదు. ఈ విషయంలో చాలా సందేహాలు వస్తుంటాయి. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక సాయంత్రం లేదా రాత్రి వీటిని తినరాదు. తింటే అవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. కనుక రాత్రి పూట నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీంతోపాటు గ్యాస్, కడుపు ఉబ్బరం వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక సాయంత్రం లేదా రాత్రి మొలకలను తినరాదు.
ఇక మొలకెత్తిన విత్తనాలను ఉదయం తినవచ్చు. ఉదయం మీరు తినే బ్రేక్ ఫాస్ట్‌తో పాటు వీటిని ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం మనకు శక్తి బాగా అవసరం అవుతుంది కనుక మొలకలను తింటే ఆ శక్తి భర్తీ అవుతుంది. దీంతో రోజు మొత్తానికి కావల్సిన శక్తి మనకు లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. చిన్నారులు అయితే చురుగ్గా అన్నీ నేర్చుకుంటారు. చదువుల్లో రాణిస్తారు. అందుకని మొలకెత్తిన విత్తనాలను ఉదయం తింటేనే మేలు జరుగుతుంది.
ఇక మొలకెత్తిన విత్తనాలను ఉదయం తింటే అందులో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా మధ్యలో స్నాక్స్, చిరుతిళ్లు తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు, డైట్‌ను పాటించేవారు.. ఉదయం మొలకెత్తిన విత్తనాలను తింటే.. బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
ఇక ఉదయం వ్యాయామం లేదా జిమ్ చేసేవారు ఆ పనిచేశాక మొలకలను తినాలి. దీంతో కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. అలాగే కండరాలకు శక్తి అందుతుంది. కండరాలు మరమ్మత్తులకు గురవుతాయి. కండరాల నిర్మాణం జరుగుతుంది. దీంతో చక్కని దేహాకృతి సొంతం అవుతుంది. ఇలా మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటే అధిక ప్రయోజనాలను పొందవచ్చు.