Sleep : నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం.. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించేవరకు చాలా మంది రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఒత్తిడిని అధికంగా ఎదుర్కొంటుండడం వల్ల రాత్రి నిద్ర పట్టడం లేదు. దీంతో నిద్రలేమి సమస్య వస్తోంది. ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. అయితే రాత్రి పూట నిద్ర సరిగ్గా పడితే చాలు.. ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఈ క్రమంలోనే రాత్రి నిద్రకు ముందు వీటిని తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. దీంతోపాటు ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు లేదా మిరియాల పొడి లేదా తేనె కలిపి తాగాలి. దీని వల్ల నిద్ర చక్కగా పట్టడమే కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
2. డార్క్ చాకొలెట్‌లలో సెరొటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది. కనుక రాత్రి నిద్రకు కనీసం గంట ముందు డార్క్ చాకొలెట్‌ను కొద్దిగా తినాలి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండెను సంరక్షిస్తాయి.
3. సాయంత్రం సమయంలో స్నాక్స్‌కు బదులుగా 10 బాదంపప్పులను తినాలి. వీటిల్లో జింక్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. రాత్రి పూట నిద్రకు కనీసం గంట ముందు చెర్రీ పండ్లు లేదా అంజీర్ పండ్లను తినాలి. ఇవి నిద్ర పట్టేలా చేస్తాయి. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
5. సాయంత్రం సమయంలో టీ, కాఫీలకు బదులుగా ఏదైనా హెర్బల్ టీని తాగండి. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో హాయిగా అనిపిస్తుంది. ఫలితంగా గాఢ నిద్ర పడుతుంది.