ఆలోచించే బుర్ర ఉండాలే గానీ.. నిజానికి సమాజంలో ఎవరైనా సరే.. ఏ వ్యాపారమైనా చేయవచ్చు. కాకపోతే.. కొద్దిగా శ్రమపడాలి.. అంతే.. ఈ క్రమంలోనే నిరుద్యోగులు, మహిళలు చేసేందుకు అనేక రకాలా సులభమైన వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పప్పు ధాన్యాలను పొట్టు తీసి విక్రయించే బిజినెస్ కూడా ఒకటి. వినేందుకు కొత్తగా అనిపిస్తున్నా.. దీంతో నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చు. మరి ఈ వ్యాపారం ఎలా చేయవచ్చో.. ఇందుకు ఏమేం అవసరమో..? ఇప్పుడు తెలుసుకుందామా..!
మనం సహజంగా సూపర్ మార్కెట్లు, ఒక మోస్తరు కిరాణా షాపులకు వెళ్తే మనకు కందిపప్పు, మినపపప్పు లాంటి వాటిని ప్యాకెట్లలో విక్రయిస్తారు తెలుసు కదా. అర కిలో, కిలో, 2 కిలోల ప్యాకెట్లలో అవి మనకు అందుబాటులో ఉంటాయి. అయితే నిజానికి వాటిని పొట్టు తీసి అలా నిర్దిష్టమైన బరువుల్లో ప్యాక్ చేస్తారు. అదే బిజినెస్ చేసి ఎవరైనా.. సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఆ పప్పులను పొట్టు తీసేందుకు ఒక మెషిన్ ఉంటుంది. అందులో ఆ పప్పులను వేస్తే.. వాటి పొట్టు పోయి అవి బయటకు వస్తాయి. వాటిని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లకు, హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించవచ్చు. దీంతో లాభాలు గడించవచ్చు.
కందిపప్పు, మినపప్పు లాంటి పప్పులకు ఉండే పొట్టును తీసే యంత్రాన్ని Automatic Gram Peeling Machine అంటారు. దీన్ని ఇండియా మార్ట్ లేదా ఆలీబాబా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.1.35 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ వ్యాపారం చేయాలనుకునే వారు తమ సామర్థ్యాన్ని బట్టి పెద్ద మెషిన్‌లను కొనుగోలు చేసి ఆ మేర డబ్బులు సంపాదించవచ్చు. ఇక ఒక సాధారణ గ్రామ్ పీలింగ్ మెషిన్ ద్వారా గంటకు 25 కిలోల వరకు పప్పులకు పొట్టు తీయవచ్చు. ఈ క్రమంలో ఈ మెషిన్ ద్వారా నెలకు కనీసం ఎంత లేదన్నా రూ.1 లక్ష వరకు సంపాదించవచ్చు.
కాగా సదరు Automatic Gram Peeling Machine కు పెద్దగా మ్యాన్‌పవర్ కూడా అవసరం లేదు. మెషిన్ వద్ద ఒక్కరు ఉంటే సరిపోతుంది. ఈ క్రమంలో మెషిన్ పైభాగంలో పొట్టుతో ఉన్న పప్పును వేస్తే.. కింది భాగంలో పొట్టు తీయబడిన పప్పు వస్తుంది. దాన్ని 500 గ్రాములు, 1 కిలో, 2 కిలోల ప్యాక్‌లలో ప్యాక్ చేసుకుని హోల్‌సేల్ వ్యాపారులకు, సూపర్ మార్కెట్లకు విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. అయితే వ్యాపారులకు విక్రయించాలంటే.. ఈ బిజినెస్ గురించి ముందుగా మార్కెటింగ్ చేయాలి. ఏయే ప్రాంతాల్లో పప్పును కొనేవారు ఉన్నారు, వారు పప్పును ఎంత రేటుకు కొంటారు, మార్జిన్ ఎంత వస్తుంది, దాంతో ఆదాయం ఎంత వరకు వస్తుంది..? రవాణా ఖర్చులు ఎంతవుతాయి..? అన్న వివరాలను ముందుగానే లెక్క వేసుకోవాలి. ఆ తరువాతే ఈ బిజినెస్ ప్రారంభించాలి.
ఈ బిజినెస్ వృద్ధి చెందాలంటే.. వీలైనంత ఎక్కువగా మార్కెటింగ్ చేసి.. వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లాభాలు ఎక్కువగా వస్తాయి. ఇక పెద్ద మెషిన్లతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నిత్యం 500 కేజీల నుంచి 4, 5 టన్నుల వరకు పప్పును ప్యాక్ చేసి విక్రయించవచ్చు. దాంతో రూ. లక్షల్లో లాభాలు వస్తాయి. ఈ బిజినెస్‌కు పెద్దగా స్కిల్స్ ఉండాల్సిన పనికూడా లేదు. మార్కెటింగ్ చేయగలిగే ఓపిక ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో ముందుకు సాగవచ్చు..!