హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..? నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్లయింది. ఆయన భార్య పేరు సువర్చల. అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందట. దీని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమంతుడు సూర్య భగవానుడిని గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే కచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువర్చల అనే యువతిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజగా పుడుతుంది. అంటే స్త్రీ యోనిలో నుంచి కాకుండా సూర్యుని తేజస్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కూతురుగా ఉంటుంది. ఈ క్రమంలో సువర్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతున్ని కోరుతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు.
దీంతో సూర్యుడు గురు దక్షిణగా అయినా సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు అంటాడు, పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని, ఆ పెళ్లి లోక కల్యాణం కోసమే గానీ నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చని, లోక కల్యాణం జరుగుతుందని, అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆమె కనిపించదు. ఈ క్రమంలో హనుమ ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇదీ… హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
అయితే హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే. హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువర్చలా దేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు..!