Coconut In Shiva Temple : మనం ఏదైనా దేవాలయానికి వెళితే ఆ దేవుడికి మనం కొబ్బరికాయ, పూలు, పండ్లు వంటివి తీసుకు వెళ్తూ ఉంటాము. ఏ ఆలయానికి వెళ్ళినా కచ్చితంగా కొబ్బరికాయని తీసుకువెళ్లి, అక్కడ ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయని కొట్టి, పూజ అయిన తర్వాత ఒక కొబ్బరి చెక్కని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయని ఇంటికి తీసుకు వెళ్ళకూడదు అనే సందేహం చాలా మందిలో ఉంది. మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ నాడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. విచారశర్మ అనే కొడుకున్నాడు అతనికి. వేదం చదువుకున్నాడు. చక్కటి సుస్వరంతో చదివేవాడు. ఈ పిల్లవాడు గోవులు, దేవతలని నమ్మేవాడు. ఆవులను కాస్తున్న అతను ఆవును కొడుతూ తీసుకు వస్తున్నప్పుడు ఈ పిల్లవాడు చూస్తాడు. బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నువ్వు వీటిని కొట్టవద్దు అని చెప్పాడు. బాగా వేదం చదువుకున్నాడు. ఆవులను కాపాడితే మంచిదే అని ఊళ్ళో వాళ్లంతా కూడా ఆవుల వెనుక ఈ పిల్లవాడిని పంపారు.
వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో పన్నాల శక్తి గురించి మీరు విని వుంటారు. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను ఈ పిల్లాడు చదువుతూ వాటిని కాపాడేవాడు. ఈ పిల్లవాడి వలన ఆవులు రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇచ్చేవి. రుద్రం చదవడం కంటే గొప్పది ఏమీ లేదు. అందుకనే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలంటారు. వీటిని చదవడం వలన పాపములు అన్నీ కూడా పోతాయి. ఈ పిల్లవాడు రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి పాలను తీసి అభిషేకం చేస్తూ ఉండేవాడు.
అతని మనస్సు ఈశ్వరుని మీదే ఉండేది. పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తుండగా తండ్రి చూసి.. ఇసుకలో పాలు పోస్తున్నాడని పరుగెత్తుకుంటూ వచ్చి కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి కాలితో సైకత లింగమును తన్నాడు. అదంతా కూడా పోతుంది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. ఎవరు తన్నారు అనేది చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదముని గొడ్డలి తీసి నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. అలా తండ్రి కిందపడిపోయాడు. రక్తం కారి తండ్రి చనిపోయాడు.
ఆ సైకతలింగం లోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. ఈరోజు నుండి నీవు మా కుటుంబంలో ఒకడివి. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడే కదా… నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఆ తరువాత పార్వతితో శివుడు ఇలా అంటాడు. అంతఃపురంలో నాకు భోజనం నువ్వు పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటాడని చెప్తాడు శివుడు. అయితే మనం కొబ్బరికాయ కొట్టి అక్కడే వదిలేయాలనేమీ లేదు. చండీశ్వరుడుకి చూపించిన తర్వాత దాన్ని తెచ్చుకోవచ్చు. పూర్ణాధికారం ఉంటుంది. ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. అక్కడ వదిలేస్తే మాత్రం మంచిది కాదు. మీ కోరికలు తీరవు.