మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటి చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటివాటిలో చాలా అరుదైన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయి. అయితే భీముడు రాని కారణంగా.. నిమ్మ చెట్టునే శివలింగంగా మార్చి.. ధర్మరాజు ప్రతిష్ట చేసిన ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? భారత దేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు .. పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని బాగా ప్రసిద్ధి చెందాయి.. కొన్నింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. రావాల్సిన గుర్తింపు దక్కనివి కూడా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పూరాతన ఆలయాలు ఉన్నాయి. అయితే వాటి ప్రత్యేకతలు ఇప్పటికే చాలామందికి తెలియదు.. అలాంటి వాటిలో ఒకటి.. జగన్నాథగట్టు ఆలయం. ఈ ఆలయం నిర్మాణం వెనుక చాలా పెద్ద కథే ఉంది అంటారు పూర్వీకులు.
శివునికి ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కర్నూలు లోని బి.తాండ్రపాడు లో ఉంది. పట్టణం నుండి నంద్యాల వెళ్ళే మార్గంలో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల దాటగానే ఈ కొండకు దారి ఉంది. ఈ ఆలయంలోని లింగానికి ఉన్న చరిత్రవల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కథనం. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు. ఈ ఆలయానికి 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సంగమేశ్వరాలయాలలోని రూపాల సంగమేశ్వరాలయం ఇక్కడికి తరలించడంతో, ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకొంది. పూర్వం పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో సప్త నదుల సంగమం అని పిలువబడే సంగమేశ్వరంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్టించాలనుకుని.. శివలింగాన్ని తీసుకురమ్మని భీముడిని కాశీకి పంపుతాడు. కానీ, విగ్రహ ప్రతిష్టాపన ముహుర్త సమయానికి భీముడు రాకపోవడంతో. నిమ్మ చెట్టుతో ఒక శివలింగ ఆకృతిని చేసి ప్రతిష్టించాడని చరిత్ర పురాణాలు చెబతున్నాయి. తరువాత భీముడు కాశీనుంచి శివ లింగాన్ని తీసుకురాగానే దానిని కూడా ప్రతిష్టించారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మించడంతో సంగమేశ్వరం ఆలయం నీట మునుగుతుండటంతో అక్కడి నుంచి కర్నూలు సమీపంలో కొండపై ఆలయం నిర్మించడంతో ఆ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది అప్పటి నుంచి ఆ ప్రాంతానికి జగన్నాధ గట్టు అనే పేరు వచ్చిందని ప్రతితి. ఆలయం లోపల నటరాజ మూర్తులు ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు కొలువుదీరాయి. అదేవిదంగా ఆలయ గోపురానికి ఇరువైపులా చక్కటి శిల్పా కలలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ గుడికి వెళ్లేదారిలో బసవేశ్వరుడు , గుడి ఆవరణలో ఆదిశేషుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయంలో ప్రవేశించగానే చుట్టూ చెట్లు పచ్చదనంతో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అలా వచ్చిన భక్తులు కూర్చోడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.
ప్రతి నిత్యం విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా శివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీని సమీపంలోనే అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆలయం వెనక భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడి నుంచి చుస్తే కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుంది. అంతేకాదు హైదరాబాద్- బెంగళూరు నేషనల్ హైవే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళే దారిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ ఉంది. కర్నూలు నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కలదు. కర్నూలు, నంద్యాల రైల్వేస్టేషన్‌లు ఈ ఆలయానికి దగ్గరగా ఉంటాయి. ఆ రైల్వేస్టేషన్‌ల దగ్గర దిగి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.