Darbhalu : హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి, దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జరగదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమయ్యాయి. దీంతో ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగిస్తున్నారు. దర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తాయి. విషానికి విరుగుడు గుణం కలవి. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి వుంచడం గమనించవచ్చు. దర్భలని సంస్కృతంలో అగ్ని గర్భం అంటారు. కుంభాభిషేకాలలోనూ యాగశాలలోని కలశాలలోనూ, బంగారు, వెండి తీగలతోపాటు దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.
దర్భలలో కూడా స్త్రీ, పురుష , నపుంసక జాతి దర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో దళసరిగా వుంటే అది స్త్రీ దర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చు. దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు, మధ్యస్థానంలో మహావిష్ణువుకు, శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు. వైదికకార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు.
ఈ వేలిలో కఫనాడి వుండడం వలన ఈ ఉంగర ధారణవలన కఫం శుభ్రం చేయబడుతుంది. ప్రేత కార్యాలలో ఒక దర్భతోను, శుభ కార్యాలలో రెండు దర్భలతోను, పితృ కార్యాలలో మూడు దర్భలతోను, దేవ కార్యాలలో నాలుగు దర్భలతోనూ దర్భ ఉంగరాన్ని ముడి వేస్తారు. దేవతారాధన, జపం, హోమం, దానం, తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి. ఆదివారం కోసిన దర్భలను ఒక వారంపాటు ఉపయోగించవచ్చు. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చు. పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చు. శ్రావణమాసంలో కోసిన ధర్భలను తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చు. భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరుమాసాలు ఉపయోగించవచ్చు. శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజు కా రోజే ఉపయోగించాలి. ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాడే దర్భలను వశిష్ట దర్భ లేదా విశ్వామిత్ర దర్భలుగా పిలుస్తుంటారు. ఏది ఏమైనా ఈ దర్భలకు అనేక గుణాలు ఉన్నాయని చెప్పవచ్చు.