Kallu Chidambaram : కళ్లు చిదంబరం.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఎన్నో సినిమాల్లో కళ్లు చిదంబరం కమెడియన్‌గా అలరించారు. మెల్లకన్ను వల్ల ఈయన కమెడియన్‌గా గుర్తింపు పొందారు. ఈయన నటించిన కొన్ని హార్రర్ సినిమాల్లో మెల్లకన్ను వల్ల ఆ పాత్రను చూస్తే భయం వేసేది. అంతలా ఈయన నటించారు. ముఖ్యంగా అమ్మోరు సినిమాలో ఈయన నటన సూపర్బ్. అలాంటి ఎన్నో భిన్నమైన క్యారెక్టర్లలో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కళ్లు చిదంబరంకు మెల్లకన్ను ఎలా వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. మరి దీని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కళ్లు చిదంబరంకు మెల్ల కన్ను ఎలా వచ్చిందో ఆయన తనయుడు తెలియజేశారు. కళ్లు చిదంబరంకు మెల్లకన్ను పుట్టుకతో వచ్చింది కాదు. ఆయన అప్పట్లో పోర్టులో ఉద్యోగం చేసేవారు. చిన్నతనం నుంచే నాటకాలంటే కళ్లు చిదంబరంకు ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే ఆయన సినిమాల్లోకి రాకముందే ఎన్నో నాటకాల్లో నటించారు. పోర్టులో ఉద్యోగం చేస్తూ కూడా నాటకాలను ఆయనే స్వయంగా అరేంజ్ చేసేవారు. వాటిల్లో నటించేవారు కూడా.
పోర్టులో ఉన్నప్పుడు ఆయన ఎంతో మందికి పని కల్పిస్తూ సహాయం చేసేవారు. ఇక ఒకానొక దశలో తిండి, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్లు చిదంబరం ఒక కన్ను వెనుక ఉన్న నరం పక్కకి జరిగింది. దీంతో ఆయనకు మెల్లకన్ను వచ్చింది. అయితే దాన్ని సరిచేయవచ్చని డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన నటించిన కళ్లు అనే సినిమా ద్వారా ఆయనకు పాపులారిటీ వచ్చింది. దీంతో మెల్లకన్ను ద్వారానే ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. తరువాత అదే మెల్లకన్ను ఇతర సినిమాల్లోనూ కంటిన్యూ అయింది. ఒక్కో సినిమా తరువాత ఆపరేషన్ చేయించుకుందామనే అనుకున్నారు. కానీ మెల్లకన్ను వల్లనే ఆయనకు సినిమా ఆఫర్లు బాగా వచ్చాయి. దీంతో ఆయన ఆ కన్నుకు సర్జరీ చేయించుకోలేదు. ఇదీ.. కళ్లు చిదంబరం మెల్లకన్ను వెనుక ఉన్న అసలు విషయం.