కాంచీపురంలో ఉన్న ఆలయం ఇది.. దర్శించుకుంటే సకల వ్యాధులు పోతాయట..!

మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి ఆలయాలలో ఒక్కో ఆలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉంది. అయితే ఈ ఆలయాలలో దాగి ఉన్న విశిష్టతల గురించి, రహస్యాల గురించి తెలుసుకున్నప్పుడు కొంతమేర ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికీ కొన్ని ఆలయాలలో దాగి ఉన్న మిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నప్పటికీ అవి కేవలం మిస్టరీలుగా మాత్రమే ఉండిపోయాయి. మరి అలాంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే ఆలయం గురించి ఇక్కడ తెలుసుకుందామా..!

kanchipuram varadaraja swamy temple pilgrims visit to get relief from chronic diseases

తమిళనాడులోని కాంచీపురం సమీపంలో ఉన్న అత్తి వరద రాజ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..  ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న రెండు బల్లులను స్పృశిస్తే (టచ్‌ చేస్తే) ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య అయినా సరే తగ్గిపోతుందని విశ్వసిస్తారు. అందుకు ఈ ఆలయానికి చెందిన స్థల పురాణమే కారణమని చెప్పవచ్చు.

ఒకప్పుడు గౌతమ మునికి చెందిన ఇద్దరు శిష్యులు పూజ కోసం రోజూ నీళ్లను తెచ్చేవారు. ఒక రోజు ఒక పాత్రలో నీటిని నింపగానే అందులో బల్లి పడుతుంది. ఈ విషయాన్ని శిష్యులు గమనించలేదు. దాన్ని అలాగే ముని వద్దకు తీసుకెళ్తారు. ఈ క్రమంలో ఆ పాత్రలోని నీటిలో ఉన్న బల్లిని చూసిన గౌతమ ముని ఆగ్రహించి.. తన ఇద్దరు శిష్యులను బల్లులుగా మారమని శాపం పెడతాడు.

తరువాత వారు ఈ వరద రాజ స్వామి ఆలయానికి వచ్చి అక్కడే పూజలు చేస్తూ బల్లుల రూపంలో చాలా కాలం పాటు ఉంటారు. ఈ క్రమంలోనే వారికి శాపం తొలగిపోతుంది. తరువాత  ఒక సమయంలో సరస్వతీ దేవిచే శాపం పొందిన ఇంద్రుడు కూడా ఏనుగు రూపంలో ఇక్కడికి వచ్చి స్వామి వారికి పూజలు చేసి శాప విముక్తుడు అయినట్లు స్థల పురాణం చెబుతోంది. అయితే అప్పట్లో వచ్చిన ఆ ఇద్దరు శిష్యులు బల్లుల రూపంలో ఈ ఆలయంలోనే వెలిశారని చెబుతారు. అందుకనే ఆలయంలో రెండు బల్లుల బొమ్మలు ఉంటాయి. వాటిని తాకితే ఎలాంటి వ్యాధి అయినా నయం అవుతుందని భక్తులు నమ్ముతారు.

ఇక ఈ ఆలయానికి ఉన్న ఇంకో విశిష్టత ఏమిటంటే.. ప్రధాన విగ్రహంతోపాటు అత్తి పండు చెట్టుకు చెందిన చెక్కతో తయారు చేసిన  ఓ చెక్క విగ్రహం కూడా ఆలయం కింది భాగంలో ఉంటుంది. దాని దర్శనం ఎవరికీ లభించదు. కేవలం 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఆ విగ్రహాన్ని బయటకు తీసి 48 రోజుల పాటు పూజలు చేసి తిరిగి అక్కడే పెట్టి తాళం వేస్తారు. మళ్లీ 40 ఏళ్లకు ఆ విగ్రహాన్ని తీస్తారు. ఈ క్రమంలోనే చివరి సారిగా ఆ విగ్రహాన్ని 2019లో జూలై 1 నుంచి ఆగస్టు 17 వరకు బయటకు తీసి పూజలు చేశారు. మళ్లీ 2059లోనే ఆ విగ్రహాన్ని బయటకు తీస్తారు.

ఈ ఆలయం అన్ని వేళల్లోనూ తెరిచే ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చు. చైత్ర పౌర్ణమితోపాటు సంక్రాంతి సమయంలో ఈ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు ఉచితంగానే ప్రవేశం కల్పిస్తారు. ఎలాంటి ఫీజు ఉండదు. అయితే ఫొటోలు తీసుకోవాలంటే రూ.50, వీడియోలకు రూ.100 ఫీజు చెల్లించాలి.

కాంచీపురం వరదరాజ స్వామి ఆలయానికి సులభంగానే వెళ్లవచ్చు. తిరుపతి నుంచి అక్కడికి 112 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి తరచూ బస్సులను నడుపుతారు. కాంచీపురం బస్‌ స్టేషన్‌ నుంచి ఆలయం 3.6 కిలోమీటర్ల దూరంలో, కాంచీపురం రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయం 4.8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ ఆలయానికి 4.8 కి.మీ. దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉండగా, 5.2 కి.మీ. దూరంలో కైలాసనాథ ఆలయం ఉంది. 2.9 కి.మీ. దూరంలో కంచి కామాక్షి అమ్మ ఆలయం ఉంది.

Share
Editor

Recent Posts