ఆధ్యాత్మికం

Kondagattu Temple : కొండ‌గట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌య ర‌హ‌స్యం తెలుసా..?

Kondagattu Temple : తెలంగాణ రాష్ట్రంలోని అనేక సుప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో కొండ‌గ‌ట్టు కూడా ఒక‌టి. ఈ క్షేత్రం క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. వేముల‌వాడ నుంచి 30 కిలోమీట‌ర్ల దూరంలో కొండ‌గ‌ట్టు ఉంటుంది. ఈ క్షేత్రంలో స‌హ‌జ‌సిద్ధంగా వెల‌సిన కొనేటిలో పుణ్య‌స్నానం చేస్తే భ‌క్తులు తాము చేసిన పాపాలు పోయి మోక్షం క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు. అలాగే వ్యాధులు ఉన్న‌వారు, సంతానం లేని వారు పూజ‌లు చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంద‌ని న‌మ్ముతారు. ఈ ఆల‌యంలో 41 రోజుల పాటు గ‌డిపితే ఎలాంటి వ్యాధి అయినా న‌య‌మ‌వుతుంద‌ని భ‌క్తులు విశ్వసిస్తారు.

సుమారుగా 500 ఏళ్ల కింద‌ట కొడిమ్యాల‌లో ఉండే సంజీవుడు అనే ఓ ప‌శువుల కాప‌రి కొండ‌గట్టుకు త‌న ప‌శువుల‌ను మేత‌ల‌కు తోలుకుని వ‌చ్చాడ‌ట‌. అయితే త‌న మందలో నుంచి ఓ ఆవు త‌ప్పిపోగా దాన్ని వెతుకుతూ సంజీవుడు అల‌సిపోయి ఓ చెట్టు కింద కునుకుతీస్తాడు. దీంతో క‌ల‌లో సంజీవుడికి ఆంజ‌నేయ‌స్వామి క‌నిపించి త‌న‌కు ఎండ‌, వాన నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, త‌న‌ను ముళ్ల పొద‌ల నుంచి తీసి త‌న‌కు ఓ చిన్న ఆల‌యాన్ని నిర్మించాల‌ని ఆంజ‌నేయ స్వామి సంజీవుడికి చెబుతాడు. ఇక నిద్ర నుంచి లేచే స‌రికి త‌ప్పిపోయిన త‌న ఆవు సంజీవుడికి ఎదురుగా నిల‌బ‌డి ఉంటుంది. దీంతో సంజీవుడు వెంట‌నే స‌మీపంలో ఉన్న ముళ్ల పొద‌లోకి వెళ్లి చూడగా అక్క‌డ ఆంజనేయ స్వామి విగ్ర‌హం ఉంటుంది. దాన్ని అత‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో బ‌య‌ట‌కు తీసి ఆ విగ్ర‌హానికి చిన్న‌పాటి ఆల‌యాన్ని నిర్మిస్తాడు. అప్ప‌టి నుంచి ఆ ఆల‌య‌మే కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యంగా ఎంతో పేరుగాంచింది. ఇదీ ఆ ఆలయానికి ఉన్న స్థ‌ల పురాణం.

కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యంలో ఏడాదిలో ప‌లు ముఖ్య‌మైన దినాల్లో ఉత్స‌వాలు, పూజ‌లు, ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంటారు. ఈ ఆల‌యంలో ఏటా చైత్ర పౌర్ణమిరోజున‌ హనుమాన్‌ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు పెద్ద హనుమాన్‌ జయంతిల‌ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జ‌యంతి ఉత్స‌వాల్లో ఆంజ‌నేయ‌స్వామి దీక్ష చేప‌ట్టిన ల‌క్ష‌లాది మంది భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకున్న త‌రువాత ఆల‌యంలో ముడుపులు కట్టి వెళ్తారు. ఇక పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆల‌యంలో 3 రోజుల పాటు హోమం, ఇత‌ర కార్యక్ర‌మాలు నిర్వహిస్తారు.

Kondagattu Temple do you know the secret

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో ఉగాది రోజు పంచాంగ శ్ర‌వ‌ణం, చైత్ర శుద్ధనవమి రోజున‌ శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం, శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాల్లో నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం, వైకుంఠ ఏకాదశి రోజున‌ ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం, లోక కల్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు, ప్రపంచ శాంతి కోసం ఏటా 3 రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం.. త‌దిత‌ర ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు.

ఇక ఈ ఆల‌యంలో రోజూ ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన, 5.45 నుంచి 6 గంటల వరకు బాలబోగ నివేద మొదటి గంట, 6 నుంచి 7.30 గంటల వరకు సూర్య దర్శనం, 7.30 నుంచి 9 గంటల వరకు నిత్యహారతులు, 9 నుంచి 11.30 వరకు శ్రీస్వామివారి అభిషేకం, 11.30 నుంచి 12.30 వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో గంట, 12.45 వరకు భజన తీర్థప్రసాదం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. అలాగే నిత్యం మ‌ధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు విరామం ఉంటుంది. కానీ మంగళ, శనివారాలలో మాత్రం ఈ స‌మ‌యంలోనూ ఆల‌యం తెరిచే ఉంటుంది.

ఇక నిత్యం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు సూర్య దర్శనం, 4.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ స్వామి వారి ఆరాధన, మూడో గంట ఉంటాయి. అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిత్యహారతులు, రాత్రి 7 గంటల వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన, రాత్రి 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి సేవా ఉత్సవం, రాత్రి 8.15 గంటలకు భజన, రాత్రి 8.30 గంటలకు కవట బంధనం కార్య‌క్ర‌మాలు ఉంటాయి. అలాగే సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆల‌యం మూసేస్తారు. మ‌ళ్లీ రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూస్తారు.

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి దేవాల‌యంలో ఉపాల‌యాలు కూడా ఉన్నాయి. శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి, అమ్మ‌వారి ఆల‌యాలు ఉన్నాయి. ఆ ఆల‌యాల్లో నిర్వ‌హించే సేవా కార్య‌క్ర‌మాల్లోనూ భ‌క్తులు పాల్గొన‌వ‌చ్చు. అమ్మ‌వారికి కుంకుమార్చ‌న చేయ‌వ‌చ్చు. సాయంత్రం జ‌రిగే నిత్య హార‌తుల్లో భ‌క్తులు పాల్గొన‌వ‌చ్చు. ఇక ప్ర‌ధాన ఆల‌యానికి వెనుక వైపు భేతాళ స్వామి, రామాల‌యాలు ఉంటాయి. కానీ వాటిల్లో ఎలాంటి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌రు. సాధార‌ణ పూజ‌లే ఉంటాయి.

కొండ‌గ‌ట్టుకు వెళ్లాలంటే హైద‌రాబాద్ నుంచి 160 కిలోమీట‌ర్ల దూరం వ‌స్తుంది. హైద‌రాబాద్ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ల నుంచి టీఎస్ఆర్‌టీసీ న‌డిపే బ‌స్సులు ఉంటాయి. జగిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌ల‌కు వెళ్లే బ‌స్సులు ప్ర‌తి 30 నిమిషాల‌కు ఒక‌టి చొప్పున ఉంటాయి. వాటిల్లో ప్ర‌యాణించి కొండ‌గ‌ట్టుకు చేరుకోవచ్చు. లేదా ప్రైవేటు క్యాబులు, సొంత వాహ‌నాల్లోనూ ఈ ఆల‌యానికి చేరుకోవ‌చ్చు.

Admin

Recent Posts