Panchamukha Hanuman : ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దేవుడి ఫోటోలని పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది ఆంజనేయ స్వామి ఫోటోలని కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఫోటోలని పెట్టుకునేటప్పుడు పలు నియమాలని కూడా పాటిస్తూ వుంటారు. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మీరు వినే ఉంటారు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకే సారి విచ్చిన్నం చేస్తే మహి రావణుడు ప్రాణాలు విడుస్తాడని తెలుసుకుని హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని దాలుస్తాడు.
అందులో ఒకటి ఆంజనేయ స్వామిది. మిగిలినవి గరుడ, వరాహ, హైగ్రీవ, నరసింహ రూపాలు. ఇలా పంచముఖ ఆంజనేయ స్వామి రూపం వచ్చింది. తూర్పు ముఖంగా హనుమంతుడు పాపాలని పోగొడుతాడు. చిత్తశుద్ధిని కలగజేస్తాడు. బాధలు, కష్టాలని దూరం చేస్తాడు. దక్షిణ ముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి శత్రు భయాలని పోగొడతాడు. విజయాన్ని అందిస్తాడు.
పడమర ముఖంగా మహా వీర గరుడ స్వామి ఉన్నాడు. పడమటి దిక్కు వైపు ఉన్న హనుమంతుడు ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు. ఉత్తర ముఖంగా లక్ష్మీ వరాహ మూర్తి ఉన్నాడు. ఆయన గ్రహ చెడు ప్రభావాల్ని తప్పిస్తాడు. అష్టైశ్వర్యాలని ఇస్తాడు. ఊర్ధ్వంగా ఉండే హైగ్రీవ స్వామి జయాన్ని, జ్ఞానాన్ని అందిస్తాడు. సంతానాన్ని కలిగిస్తాడు. ఆంజనేయ స్వామిని పూజించడం వలన అనుకున్నవి నెరవేరుతాయి.
శ్రీ రామజయం అనే మంత్రాన్ని 108 సార్లు రాసి ఆంజనేయ స్వామికి మాలగా వేస్తే అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. శని, మంగళ వారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేయడం, వెన్నని సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి. ఇలా ఈ విధంగా హనుమంతుడిని పూజిస్తే ఏ కష్టం, ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు అని పండితులు అంటున్నారు.