పితృ తర్పణ రోజుల్లో హిందువులు తమ పెద్దవారిని తలచుకుని వారికి శ్రాద్ధ కర్మలు చేసి తర్పణాలు వదులుతారు. ఈ పితృ తర్పణ రోజుల్లో గతించిన పెద్దలని పూజిస్తే తమ పూర్వీకులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తారని నమ్మకం. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ రోజులు వస్తుంటాయి. గతించిన పెద్దల ప్రీతి కొరకు తర్పణము, పిండ ప్రదానం చేస్తారు. పితృ పక్షాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికిల్ చదవండి. ఆత్మ కి నాశనం లేదు అని భగవద్గీత చెప్తోంది. ఆత్మ మరణించడం లేదా మరలా జన్మించడం ఉండదు. మనలో ఉన్న ఆత్మ దేనివల్లా కూడా నాశనం చేయబడదు. అది శాశ్వతమైనది. ఆత్మ యొక్క ధ్యేయం ముక్తిని లేదా మోక్షాన్ని పొందడమే. శ్రాద్ధ కర్మల వల్ల గతించిన పెద్దల ఆత్మకి శాంతి కలిగి సృష్టి కర్తలో లీనమవ్వడానికి సహాయ పడతాయి. పితృ పక్షాలలో తర్పణం వదలడం వల్ల బ్రతికి ఉన్నవారు గతించిన తమ పెద్దలకి చేయవలసిన కర్మలు చేయకపోవడం వల్ల కలిగే పాపం నుంచి బయటపడతారు. అందువల్ల అత్యంత శ్రద్ధా భక్తులతో గతించిన పెద్దలకి తర్పణాలు వదలుతారు.
కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన కర్ణుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అతనికి ఆహారంగా బంగారం, వెండి, వజ్రాలనిచ్చారు. ఇది చూసిన కర్ణుడు తాను బ్రతికుండగా దానాలు చేసాననీ అయినా తనకి ఆహారంగా వీటిని ఎందుకిచ్చారని ఇంద్రుని ప్రశ్నిస్తాడు. దానికి ఇంద్రుడు, నువ్వు దాన కర్ణుడివే, కానీ ఎల్లప్పుడూ కేవలం నీ సంపదలని మాత్రమే దానం చేసావుగానీ పితృ దేవతలకి శ్రద్ధా భక్తులతో నమస్కరించలేదనీ, వారి ప్రీతి కొరకు ఆహారం సమర్పించలేదు కాబట్టి నీకు కూడా నువ్వు దానం చేసినవే ఆహారంగా ఇచ్చాము అంటాడు. తనకి ఈ పితృ పూజలు తెలీవు కావున ఎప్పుడూ తర్పణాలు విడిచిపెట్టలేదని చెప్పిన కర్ణునికి ఇంద్రుడు పదహారు రోజులు తిరిగి భూమి మీద జన్మించి పితృ కార్యాలు నిర్వర్తించమని చెప్పాడు. ఈ పదహారు రోజులూ పెద్దల ఆత్మలు భూమి మీదకి వచ్చి తమ వారసులు ఇచ్చిన తర్పణాలు పుచ్చుకుని వారిని ఆశీర్వదిస్తారని నమ్మకం. తర్పణాలు వదలడానికి కొన్ని ప్రాశస్త్యమైన ప్రదేశాలున్నాయి. ఆయా ప్రదేశాలలో ప్రత్యేక శక్తులుండటం వల్ల అక్కడ విడిచే తర్పణాలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అలాంటి స్థలాలు ప్రయాగ, వారణాశి, కేదార్‌నాధ్, గయ, రామేశ్వరం, బదరీనాధ్, కపాల్ మోచన్ సేష్ అంబాడీ, నాసిక్.
కుటుంబ పెద్ద లేదా పెద్ద కొడుకు తర్పణాలని వదలాలి. అలా కుదరని పక్షంలో కుటుంబంలోని మగవారెవరైనా చెయ్యవచ్చు. శ్రాద్ధ కార్యక్రమంలో తమ భావాలని అదుపులో ఉంచుకోవడం చాల ముఖ్యం. తమ కోపాన్ని అదుపులో ఉంచుకునే శక్తినిమ్మని భగవంతుణ్ణి ప్రార్ధించాలి. పైన చెప్పిన ముఖ్య స్థలాలలో శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కాని పక్షంలో బ్రాహ్మణులని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం, బట్టలు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని అందించాలి. అర్హుడైన బ్రాహ్మణునికి అందించినదేదైనా గతించిన పెద్దల ఆత్మలని చేరుతుందని విశ్వాసం. శ్రాద్ధ కర్మ చేశాక కాకికి ఆహారాన్ని అర్పిస్తారు. పెద్దలు కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్మకం. ఆ తర్వాత కుక్కలు, ఆవులకి కూడా ఆహారాన్ని అందిస్తారు. పితృ దోషాలు చేసినట్లయితే మహాదానం చేయడం వల్ల దాని నుంచి ముక్తి పొందవచ్చు. దీనివల్ల పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.
పితృ పక్షాలలో కొత్త బట్టలు కొనడం, పెళ్లిళ్లు వంటి శుభ కార్యాలు చేయడం, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. పొగాకు నిషిద్ధం. అలాగే ఈ పితృ పక్షాల సమయంలో ఇతరుల ఇంట్లో భుజించకూడదు. అలా చేస్తే మీకు ఉప్పు ఋణం వస్తుంది. అందువల్ల వారి పితృ దోషాలు మీకు బదిలీ అవుతాయి. ఈ దోష పరిహారార్ధం దోష నివారణ పూజలు చేయాలి.