ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం, సరైన వేళకు భోజనం చేయడం ఎంత ఆవశ్యకమో ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం. లావుగా ఉన్నవారు సన్నబడేందుకు వ్యాయామం చేయడం, చక్కని షేప్‌కు రావడం కొంత కష్టమైన పనే. అయినా ఆరోగ్యం దృష్ట్యా తప్పదు కదా. అయితే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల తరబడి వ్యాయామం చేసే వారు ఒక్కసారే సడెన్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం ఆపితే..? అప్పుడు ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయో తెలుసా..? ఏంటీ… ఎంతో కాలంగా వ్యాయామం చేసేవారు దాన్ని ఆపేస్తే పరిణామాలుంటాయా..? వారికేం జరుగుతుంది..? ఆల్రెడీ ఎక్సర్‌సైజ్ బాడీయే కదా… దాన్ని ఆపినా ఏం జరుగుతుంది, ఏమీ కాదు… అనబోతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎక్సర్‌సైజ్ అస్సలు చేయని వారికే కాదు, ఆల్రెడీ ఎన్నో రోజుల్నించీ ఎక్సర్‌సైజ్ చేస్తున్న వారు కూడా దాన్ని ఆపితే అప్పుడు ఇద్దరికీ ఒకేలాంటి పరిణామాలు ఏర్పడుతాయి. అవేమిటంటే…
ఎంతో కాలంగా వ్యాయామం చేస్తూ ఉన్నప్పటికీ ఒకేసారి దాన్ని ఆపితే… అది అలా కనీసం 3 – 4 వారాల పాటు కంటిన్యూ అయితే అప్పుడు అలాంటి వ్యక్తుల శరీరాలకు ఏం జరుగుతుందంటే… ముందుగా వారి ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయి. అంతకు మునుపులా ఫిట్‌గా ఉండరు. శక్తి సరిగ్గా ఉండదు. ఎక్సర్‌సైజ్ ఆపితే కొంత కాలానికి బాగా లావైపోతారు. ముఖ్యంగా పొట్ట బాగా పెరుగుతుంది. ఇది మేం చెబుతోంది కాదు, వైద్యులు చెబుతున్నదే. ఎక్సర్‌సైజ్ చేసే వారు దాన్ని సడెన్‌గా ఆపితే అప్పుడు శక్తి కండరాలకు చేరకుండా అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుందట. దీంతో ముందుగా పొట్ట బాగా పెరుగుతుందట. గుండె కొట్టుకోవడం, దాని పనితీరులో కూడా చాలా గణనీయమైన తేడాలు వస్తాయి. ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు, చేయనప్పుడు గుండె పనితీరులో మార్పు వస్తుందట. ఎక్సర్‌సైజ్ ఆపిన 12 వారాలకు ఫిట్‌నెస్ అస్సలు ఉండదట. ఫిట్‌నెస్ లెవల్స్ సామాన్య స్థాయికి వచ్చేస్తాయట. దీంతో అన్ని రోజులు ఎక్సర్‌సైజ్ చేసింది కూడా వృథా అయిపోతుందట.
ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మెటబాలిజం బాగా ఉండడం వల్ల ఎంత తిన్నా, ఏం తిన్నా ఆ శక్తి ఇట్టే ఖర్చయిపోతుంది. కానీ ఎక్సర్‌సైజ్ ఆపాక తిండి ఎక్కువ తిందామంటే కుదరదు. అలా తింటే లావై పోవడమే కాదు, బరువు కూడా పెరుగుతారు. వ్యాయామం చేసినప్పుడు సరిగ్గా ఉండే బీపీ లెవల్స్ అది మానేశాక అదుపు తప్పిపోతాయట. బీపీ లెవల్స్ కంట్రోల్‌లో ఉండవట. సాధారణ వ్యక్తుల బీపీ లెవల్స్ మాదిరిగా ఉంటాయట. వ్యాయామం చేసిన సమయంలో ఎక్కువ దూరం పరిగెత్తే సామర్థ్యం ఉన్నవారు కూడా దాన్ని మానేశాక కొంత దూరం నడిచే సరికే ఆయాసం చెందుతారట. రోజుల తరబడి చేస్తున్న వ్యాయామాన్ని ఒక్కసారే ఆపేస్తే దాంతో మెదడు పనితీరులో కూడా మార్పు వస్తుందట. మెదడు చురుగ్గా పనిచేయదట. ఇక చివరిగా కండరాలు. వ్యాయామం చేసినప్పుడు మంచి షేప్‌లో ఉండే కండరాలు వ్యాయామం మానేశాక షేప్‌ను కోల్పోతాయి. అయితే అవి మళ్లీ మంచి షేప్‌కు రావడం కొద్దిగా కష్టతరమవుతుందట.