తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల కొండపై అనేక విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ పైకి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి “అలిపిరి”, రెండు “శ్రీవారి మెట్టు”. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లడానికి అలిపిరి దగ్గర నుంచి ఉన్న మార్గం కాకుండా, శ్రీనివాస మంగాపురం ఆలయనికి సమీపంలో ఉన్న మరొక మార్గమే శ్రీవారి మెట్టు. అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్లు సంఖ్య కన్నా, శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ.
అలిపిరి కాలిబాట మొత్తం తొమ్మిది కిలోమీటర్లు శ్రీవారి మెట్టు కాలిబాట సుమారు మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అలిపిరి నుంచి కాలినడకన ఎక్కువ సమయం పడితే, శ్రీవారి మెట్టు నుంచి వెళితే గంటలో చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గం ఏ మాత్రం రద్దీ లేకుండా ప్రకృతి రమణీయతతో కూడి ఉంటుంది. ఈ దారిని నూరు మెట్ల దారి అని కూడా అంటారు. ఇవి నూరు మెట్లు ఉండవు సుమారు 2500 మెట్లు ఉంటాయి. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారిగుండా వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలల కాలం అగస్త్యుని యొక్క ఆశ్రమంలో గడిపి తర్వాత తిరుమల చేరుకున్నారని, పురాణ కథలు చెబుతాయి.
నడిరేయి జాములో అలివేలు మంగను చేరడానికి దిగివచ్చే స్వామి ఒక అడుగు ఈ శ్రీవారి మెట్టు పై వేసి, రెండవ అడుగు అలివేలుమంగాపురంలో వేస్తారని ప్రతిదీ. చంద్రగిరి కోటను నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా ప్రయాణించి, తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునే వారట. శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీవారి దర్శనం కోసం చంద్రగిరిలో విడిది చేసి, శ్రీవారి మెట్టు దారి లో ఏడు సార్లు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు అట. ఈ విధంగా శ్రీవారి మెట్టు దారి ప్రాచుర్యం లోకి వచ్చింది.