హిందువులు తప్పనిసరిగా పాటించే ఆచారాల్లో బొట్టు పెట్టుకోవడం కూడా ఒకటి. శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా ఆలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు బొట్టును తప్పకుండా పెట్టుకుంటారు. అయితే శివ, వైష్ణవ ఆలయాల్లో బొట్టు పెట్టుకోవడం వేరేగా ఉంటుంది. వైష్ణవాలయంలో నిలువు బొట్టు ధరిస్తే శివాలయంలో అడ్డు బొట్టు ధరిస్తారు. ఈ క్రమంలోనే బొట్టు రంగులోనూ అనేక మార్పులు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూరాన్ని ధరిస్తే శివాలయంలో భస్మాన్ని ధరిస్తారు. అయితే మీకు తెలుసా.. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో.. ఆ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన లలాటం స్థానమయ్యింది.
చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపురంగు బొట్టునే ధరించాలి. అంతేకాక, ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం… కనుబొమ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల, మానసిక ప్రవృత్తులను నశింపజేసే ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుకనే ఆ స్థానంలో బొట్టు పెట్టుకుంటారు.