Pariseshanam : పూర్వకాలం నుంచి మన పెద్దలు అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. వాటిల్లో తినే ప్లేట్ చుట్టూ నీళ్లను చల్లడం కూడా ఒకటి. ఈ అలవాటును మనం మానేశాం. కానీ మన పెద్దలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయితే ఇలా చల్లడాన్ని పరిశేషణం అంటారు. దీన్ని ఉత్తర భారతంలో చిత్ర ఆహుతి అని పిలుస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు, దీని వల్ల ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనానికి ముందు పరిశేషణం చేయడం వల్ల ఆహారం శుద్ధి అవుతుందని భావిస్తారు. మనం తినే ఆహారం విషం కాకూడదని, దాని వల్ల మన దేహానికి, బుద్ధికి బలం కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ అలా నీళ్లు చల్లుతారు. ఇక పూర్వకాలంలో అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు. ఈ క్రమంలో ఆకు నేలపై ఉన్నప్పుడు చుట్టు పక్కల నుంచి దుమ్ము, ధూళి ఆకులో పడే అవకాశం ఉంటుంది. కనుక ఆకు చుట్టూ నేలపై నీళ్లను చల్లితే అక్కడ దుమ్ము, ధూళి లేవదు. ఆకులో పడదు. దీంతో ఆహారాన్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు.
ఇక పూర్వం రోజుల్లో రాత్రి పూట మనకులా లైట్లు ఉండేవి కావు. దీపం వెలుగులోనే భోజనం చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో రాత్రి అనేక పురుగులు, కీటకాలు వచ్చేవి. అయితే భోజనం చేసేటప్పుడు పురుగులు ఆకులో పడకుండా ఉండేందుకు గాను ఆకు చుట్టూ నీళ్లను చల్లేవారు. ఈవిధంగా పరిశేషణం చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే పరిశేషణాన్ని దాదాపుగా అందరూ ఒకేవిధంగా చేస్తారు. చేతిలో నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రం చదువుతూ ప్లేట్ చుట్టూ మూడు సార్లు నీళ్లు చల్లుతారు. తరువాత అన్నపూర్ణా దేవికి నమస్కారం చేసి భోజనం చేయడం మొదలు పెడతారు. ఈవిధంగా ఇప్పుడు చాలా మంది చేయడం లేదు.