ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని మతం, వర్గం విశ్వాసాలకు అనుగుణంగా అతని సంబంధీకులు మృతదేహాన్ని దహనం చేయడమో, సమాధిలో పెట్టడమో చేస్తారు. అయితే అలా చేసే దహన కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు స్నేహితులు, తెలిసిన వారు అనేక మంది హాజరవుతుంటారు. కానీ హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా మనం చూస్తే అలాంటి దహన కార్యక్రమానికి కేవలం పురుషులు మాత్రమే హాజరవుతుంటారు. స్త్రీలు హాజరు కారు. వారు ఇంటి వద్దే ఉండిపోతారు. అయితే నిజానికి వారు అలా ఉండడం వెనుక పలు కారణాలే ఉన్నాయి. అవేమిటంటే…
పురుషులందరూ దహన కార్యక్రమానికి వెళితే స్త్రీలు ఇంటి వద్దే ఉండి ఇంటి సంరక్షణ, పిల్లల బాధ్యతలను చూసుకునేవారు. దీంతోపాటు వచ్చిన వారికి ఆహార సదుపాయాన్ని కల్పించడం కోసం స్త్రీలు ఇంటి దగ్గరే ఉండి భోజనం సంగతి చూసుకునే వారు. అందుకే దహన కార్యక్రమానికి స్త్రీలు వెళ్లేవారు కాదు. పురాతన కాలంలో ఏం చెప్పేవారంటే మహిళలతోపాటు, ప్రధానంగా పెళ్లి కాని కన్యలైన యువతులను దెయ్యాలు సులభంగా ఆవహిస్తాయని, దుష్ట శక్తులు వారిలో సులభంగా ప్రవేశించగలుగుతాయని అనేవారు. ఈ క్రమంలో వారు గనక శ్మశానానికి వస్తే దుష్ట శక్తుల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వారిని దహన కార్యక్రమానికి రావద్దనే వారు.
పురుషుల కన్నా స్త్రీలు సాధారణంగా ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు. భావోద్వేగాలను వారు అంత త్వరగా అణచుకోలేరు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కనుక వారు శ్మశానానికి వచ్చి దహనమవుతున్న తమ వ్యక్తి మృతదేహాన్ని ఎక్కువ సేపు చూసి తట్టుకుని ఉండలేరని, దీంతో వారు తీవ్రమైన డిప్రెషన్, మానసిక వేదనకు గురయ్యేందుకు అవకాశం ఉంటుందని వెనుకటికి భావించేవారు. అందుకే మహిళలను దహన కార్యక్రమాలకు దూరంగా ఉంచే వారు.
గర్భిణీ స్త్రీలనైతే మృతదేహాల దగ్గరకు కూడా వెళ్లనివ్వరు. ఎందుకంటే దుష్టశక్తుల ప్రభావం గర్భంతో ఉన్న మహిళ శిశువుపై పడుతుందని నమ్మిక. అందుకే గర్భంతో ఉన్న వారిని దహన కార్యక్రమానికి కాదు కదా కనీసం మృతదేహం వద్దకు కూడా వెళ్లనివ్వరు.