హిందువులు మాఘశుద్ద సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. మాఘశుద్ద సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా కూడా పేర్కొంటారు. అంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి రథసప్తమినాడు ఏ పనులు చేయాలో తెలుసుకోండి.
రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి, సమస్తే సూర్యమాతృకే. సప్తాశ్యముల గల ఓ సప్తమీ, నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రం అర్థం.
రథ సప్తమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి పిడకలు అంటించి, పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తే మంచిది. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పించాలి. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.