14 ఏళ్ల వయస్సులో అమితాబ్ ను ఆకట్టుకున్న అభినయం ఆర్తి ఆగర్వాల్ ది. కానీ 31 ఏళ్లకే లోకాన్ని ఎందుకు విడిచిపెట్టింది..? రంగుల ప్రపంచంలో స్టార్ గా వెలుగొందినామె, సడెన్ గా వెండితెరకు దూరం అవ్వడానికి కారణం ఏంటి ? సినిమా అనే వైకుంఠపాళి ఆటలో ఆమె ఓడిందా..? ఓడించబడిందా..? ఆర్తి అగర్వాల్.. అందం, అభినయం, చలాకీ తనంతో ఇట్టే ఆకర్షించే రూపం. పుట్టింది అమెరికాలో అయినా అచ్చం మన సాంప్రదాయపు అమ్మాయే అనేలా ఉండే రూపం. 14 ఏళ్లకే అమితాబ్ సలహాతో బాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసింది ఆర్తి. తర్వాత తెలుగుకు షిఫ్ట్ అయిన ఆర్తి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. నువ్వు నాకు నచ్చావ్ నుండి సోగ్గాడు సినిమా వరకు ఆర్తి కాల్షీట్స్ కోసం వెయిట్ చేసిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు.
ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యా ప్రయత్నం. ఇదే ప్రయత్నం ఈ స్టార్ హీరోయిన్ ను అథః పాతాళానికి తోసేసింది. హీరో తరుణ్ తో ప్రేమాయణమే ఆత్మహత్యకు కారణమా..? కాదా అనేది పక్కన పెడితే సాఫీగా సాగుతున్నఆర్తి కెరీర్లో, ఇదిపిడుగు పాటే. తరుణ్ ప్రేమ వ్యవహారం నిజమే అని అప్పట్లో సినీ ఇండస్ట్రీ కూడా కోడై కూసింది.ఆత్మహత్య ప్రయత్నం అన్న మాట విన్నప్పటి నుండి ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. కాల్షీట్ల కోసం వెయిట్ చేసిన నిర్మాతలు సైతం అప్పుడు చూసీ చూడనట్టు వ్యవహరించారు.
సినీ జీవితానికి అలవాటు పడ్డ హీరోయిన్ ఆఫర్లు లేక అల్లాడిపోయింది.. ప్రయత్నాలు గట్టిగా చేసింది కానీ ఫలితం మాత్రం కనబడలేదు. చివరకు సునీల్ తో సినిమాకు కూడా ఒప్పుకొని అందాల రాముడు సినిమాను చేసింది. ఫైనాన్షియల్ గా, కెరీర్ పరంగా సక్సెస్ అవుదామని.. సినిమా హిట్ అయినా ఆఫర్లు మాత్రం నిల్.
అభినయం లేకపోయినా అందమే ముఖ్యం అన్నట్టుగా మారింది సినీ ఇండస్ట్రీ. కానీ ఆఫర్లు లేని ఆర్తి బరువు పెరిగింది. తన కెరీర్ కు,తన బరువే పెద్ద మైనస్ అని తలచింది. అపరేషన్ చేయించుకొని సెకెండ్ ఇన్నింగ్స్ అయినా సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ విధి వక్రీకరించింది. అనంతలోకాలకు పయనమయ్యింది ఆర్తి. అలా ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసింది. కారణాలేమున్నా రంగుల ప్రపంచంతో పోటీ పడలేక ఆమె తనువు చాలించిందని చెప్పవచ్చు.