తెలుగు సినీ ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మోహన్‌బాబు వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. విదేశాల్లో చదువుకున్న ఈమె సినిమాల్లో నటించాలనే మక్కువతో ఫిలిం కోర్సు కూడా చేసింది. అయితే ఈమె విద్యాభ్యాసం ఎక్కువగా ఫారిన్‌లో జరగడం వల్ల ఈమె భాష అంతా ఇంగ్లిష్, తెలుగు కలగలిపిన యాసలో ఉంటుంది. కనుక ఈమె మాటలకు చాలా మంది పగలబడి నవ్వుతుంటారు. అయినప్పటికీ మంచు లక్ష్మి వీటన్నింటినీ పట్టించుకోదు.
ఇక అనగనగ ఓ ధీరుడు సినిమాలో మంచు లక్ష్మి విలన్‌గా నటించి మెప్పించింది. తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ అవేవీ పెద్దగా హిట్ కాలేదు. దీంతో సినిమాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంది. అయితే మళ్లీ ఇప్పుడు ఆమె పలు చిత్రాల్లో నటిస్తోంది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో ఈమె ఓ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. అయితే వాస్తవానికి మంచు లక్ష్మి ఇప్పుడు కాదు.. చిన్నప్పుడే బాలనటిగా నటించి గుర్తింపు పొందింది. ఈమె నటించిన సినిమా హిట్ కూడా అయింది.
మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు హీరోగా నటించిన పద్మవ్యూహం సినిమాలో నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఆయనే స్వయంగా ఈ మూవీని నిర్మించారు. ఇందులో ఆయన ఆలయ పూజారి పాత్రలో నటించగా.. ఆయనకు కుమార్తెగా మంచు లక్ష్మి బాలనటిగా నటించింది. ఈ మూవీ 1980లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ కావడం లేదు. దీంతో నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.