వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తనకు నచ్చిందే చేస్తూ.. నచ్చినట్టు బ్రతికేవారిలో ముందు వరుసలో ఉంటాడు. ఇక కొంతకాలంగా ఆర్జీవీ డైరెక్ట్ సినిమాలు వరుస ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. అయినా కానీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. తన సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్.. తానకు నచ్చినట్టు సినిమా తీయడమే అని, నచ్చినవాళ్లు చూడొచ్చని లేదంటే లేదని కూడా ఆర్జీవి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.
ఒకప్పటి కాలంలో ఆర్జీవి అంటే సినిమాల సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. 1990 దశాబ్దంలో ఆర్జీవీతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కట్టేవారు. 1989లో నాగార్జునతో శివ సినిమా తీసి ఆర్జీవీ డైరెక్టర్ గా తనకంటూ ఒక సెపరేట్ ట్రెండ్ ను సెట్ చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా సర్కార్ లాంటి సినిమా చేసి తన సత్తా చాటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్జీవీ కెరీర్ లో డిజాస్టర్ లతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ లు కూడా ఉన్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న తరవాత వెంకటేశ్, చిరంజీవి లతో సినిమాలు చేయాలని నిర్నయించుకున్నాడట. ఆర్జీవీతో కలిసి ఈ సినిమా చేసేందుకు వైజయంతీ మూవీస్ ముందుకు వచ్చింది. వర్మ స్క్రిప్ట్ సిద్దం చేసి చిరంజీవికి కథ వినిపించడం జరిగింది. చిరంజీవి కథ మొత్తం విని కొన్ని మార్పులు చేయాలని సూచించారట. కానీ రామ్ గోపాల్ వర్మ అందుకు నిరాకరించాడు. అంతే కాకుండా స్క్రిప్ట్ విషయంలో వేళ్లు పెడితే తాను సినిమా నుండి తప్పుకుంటానని వర్మ నిర్మొహమాటంగా చెప్పేశాడు.
కానీ అప్పటికే ఈ సినిమా కోసం రెండు పాటలను కూడా సిద్ధం చేయటం జరిగింది. కానీ చివరికి ఆర్జీవి తను ముందుగానే చెప్పినట్టుగా సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో అప్పటికే రూపొందించిన రెండు పాటలను వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించిన చూడాలని ఉంది సినిమాలో ఉపయోగించుకున్నారు. అలా ఆర్జీవీ, చిరంజీవి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా చిరంజీవి కథ విషయంలో జోక్యం చేసుకోవడంతో మధ్యలోనే ఆగిపోయింది.