Belly Fat : ప్రస్తుత తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు అధికంగా బరువు ఉండరు. కానీ వారికి పొట్ట దగ్గరి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శరీరం అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ 3 వ్యాయామాలను 5 నిమిషాలకు ఒకటి చొప్పున కనీసం 15 నిమిషాల పాటు చేయాలి. దీంతో ఎంతటి వేళ్లాడే పొట్ట అయినా సరే కరిగిపోతుంది. పొట్ట భాగం అందంగా మారుతుంది. పొట్ట దగ్గర కొవ్వు అధికంగా ఉన్నవారు ఈ మూడు వ్యాయామాలను రోజూ తప్పక చేయాల్సి ఉంటుంది. దీంతో నెల రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
వ్యాయామం – 1
నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులను వీపు కింద పెట్టాలి. కాళ్లను దగ్గరగా చేసి నిలువుగా పైకి లేపి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ భంగిమలో 5 సెకన్ల పాటు ఉండాలి. తరువాత కాళ్లను కొద్దిగా కిందకు వంచాలి. 60 డిగ్రీల కోణంలో పెట్టాలి. మళ్లీ ఈ భంగిమలోనూ 5 సెకన్ల పాటు ఉండాలి. అనంతరం కాళ్లను ఇంకాస్త కొద్దిగా కిందకు వంచాలి. ఇప్పుడు 30 డిగ్రీల కోణంలో కాళ్లను పెట్టాలి. మళ్లీ 5 సెకన్ల పాటు ఉండాలి. ఇలా చేశాక కాళ్లను కిందకు దించి యథావిధిగా నేలపై ఉంచాలి. ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి. రోజూ చేస్తుంటే అలవాటు అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు చేయగలుగుతారు. వీలుంటే సమయాన్ని పెంచుతూ పోవాలి. రోజూ కనీసం 10 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
ఈ వ్యాయామం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి బాగా పడుతుంది. అక్కడి కండరాల్లో కదలిక వస్తుంది. ఆ భాగంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.
వ్యాయామం – 2
పైన తెలిపిన వ్యాయామం లాగే ఇది కూడా ఉంటుంది. కాకపోతే కాళ్లను 60 డిగ్రీల కోణంలో ఉంచినప్పుడు వాటిని దగ్గరగా పెట్టి గాల్లోనే సైకిల్ తొక్కినట్లు తొక్కాలి. 5 సెకన్ల నుంచి 10 సెకన్ల పాటు చేశాక కాళ్లకు కిందకు దించాలి. మళ్లీ కాళ్లను పైకి లేపి అలాగే చేయాలి. ఒక్కో కాలుతోనూ దీన్ని చేయవచ్చు. ఈ వ్యాయామాన్ని 5 నిమిషాల పాటు చేయాలి. కష్టంగా ఉందనుకుంటే ఆరంభంలో 2-3 నిమిషాలు చేయవచ్చు. తరువాత సమయాన్ని పెంచుతూ పోవాలి. కనీసం రోజుకు 10 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల కూడా పొట్ట దగ్గరి కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
వ్యాయామం – 3
వ్యాయామం 1 లో చెప్పినట్లే నేలపై వెల్లకిలా పడుకుని చేతులను వీపు కింద ఉంచాలి. అనంతరం కాళ్లను కొద్దిగా పైకి లేపి 60 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఈ భంగిమలో కాళ్లను దగ్గరగా పెట్టి వాటిని ఒకేసారి గుండ్రంగా చక్రం తిప్పినట్లు తిప్పాలి. ముందుగా కుడివైపు నుంచి ఎడమకు తరువాత ఎడమ వైపు నుంచి కుడివైపుకు కాళ్లను తిప్పాలి. ఇలా 5 సెకన్ల పాటు చేయాలి. దీన్ని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ వ్యాయామం వల్ల కూడా పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
ఈ మూడు వ్యాయామాలను రోజూ కనీసం 5 నిమిషాల చొప్పున ఆరంభంలో 15 నిమిషాలు చేయాలి. తరువాత సమయం పెంచుతూ ఒక్కో వ్యాయామాన్ని కనీసం 10 నిమిషాల పాటు చేసేలా ప్లాన్ చేయాలి. దీంతో 30 నిమిషాల పాటు వీటిని చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తుండడం వల్ల కేవలం ఒక్క నెల రోజుల్లోనే పొట్ట చాలా వరకు తగ్గిపోతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.