Swimming : మనలో చాలా మంది క్యాలరీలను ఖర్చు చేయడానికి, సన్న బడడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ మనం రోజూ చేసే అన్ని రకాల వ్యయామాల కంటే స్విమ్మింగ్ చేయడం వల్లనే ఎక్కువ క్యాలరీలను కరిగించగలం అని చాలా మందికి తెలియదు. స్విమ్మింగ్ వలన కేవలం అధిక క్యాలరీలు ఖర్చవడం మాత్రమే కాకుండా శరీరం ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. ఇంకా ఒత్తిడి కూడా దూరమవుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్నపుడు శరీరాన్ని చల్లబరచడానికి మంచి మార్గంలా పనిచేస్తుంది.
వ్యాయామంలో భాగంగా పరుగెత్తడం ఇష్టం లేనివారు దానికి ప్రత్యామ్నాయంగా స్విమ్మింగ్ ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా రోజూవారి చేయాల్సిన కార్డియో మోతాదు సునాయాసంగా అందుతుంది. ఇంకా శరీరంలోని అన్ని కండరాలను ఉపయోగించడం వలన త్వరగా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరం అంతటికీ వ్యాయామం అందుతుంది. ఒక పరిశోధన ప్రకారం 30 నిమిషాలు పాటు ఈత కొట్టడం అనేది 45 నిమిషాల పాటు పరిగెత్తడంతో సమానం అని తేలింది. అలాగే గుండె కండరాలు కూడా బలంగా తయారవుతాయని ఇంకా ఒక గంట పాటు స్విమ్మింగ్ చేయడం వల్ల 400 క్యాలరీలు ఖర్చవుతాయని సూచిస్తున్నారు. అయితే రోజూ స్విమ్మింగ్ తో మన దేహానికి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
స్విమ్మింగ్ ను రోజూవారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం వలన ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడుతుంది. ఎముకల సాంద్రత పెరగడంలో సహాయ పడుతుంది. గుండె పనితీరు మెరుగుపడి కొలెస్ట్రాల్ తగ్గడం, కండరాలు గట్టి పడడం వలన తక్కువ వయసు ఉన్న వారిలా కనిపిస్తారు. ఈత కొట్టడం వలన శరీరం అంతా అలసిపోయి నిద్ర లేమి సమస్య దూరమవుతుంది. శరీరంలో అంతటా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇంకా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు తగ్గి ఎటువంటి రోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి స్విమ్మింగ్ ను రోజూవారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం అన్ని రకాలుగా లాభదాయకం అని సూచిస్తున్నారు.