Ragi Dosa : మన ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలతోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. రాగులను పిండిగా చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోదగిన వంటకాల్లో రాగిదోశ కూడా ఒకటి. రాగిదోశను మనం చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగులతో మనం దోశను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పెరుగు – పావు కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు లేదా తగినన్ని, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్.
రాగి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని, బియ్యం పిండిని, ఉప్పును, బొంబాయి రవ్వను, పెరుగును, ఒక కప్పు నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. తరువాత ఈ పిండిలో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశ పిండి కంటే కూడా పలుచగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక దాని మీద నూనె రాసి తగినంత పిండిని తీసుకుని రవ్వదోశ మాదిరిగా దోశను వేసుకోవాలి. ఈ దోశపై నూనెను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దోశలు తయారవుతాయి. ఈ రాగి దోశలను టమాట చట్నీ, పల్లి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా రాగిపిండితో రుచిగా నిమిషాల వ్యవధిలోనే దోశలను వేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.