అధిక బరువును తగ్గించుకోవడం అనేది చాలా మందికి సమస్యగా మారింది. అందుకనే చాలా మంది నిత్యం తాము తినే ఆహారాన్ని తగ్గించి తినడమో లేదా అన్నానికి బదులుగా చపాతీలను తినడమో చేస్తుంటారు. అయితే నిజానికి చపాతీలకు, బరువు తగ్గేందుకు సంబంధం లేదు. అన్నం తింటూ కూడా బరువు తగ్గవచ్చు.
చాలా మంది చపాతీలను తింటే బరువు తగ్గవచ్చని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అన్నంలో, చపాతీలను తయారు చేసేందుకు వాడే గోధుమ పిండిలో పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్లు) దాదాపుగా సమానంగా ఉంటాయి. అందువల్లే వేటిని తిన్నా మన శరీరానికి కార్బొహైడ్రేట్లు అందుతాయి. అయితే నిత్యం కార్బొహైడ్రేట్లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారాలను సమపాళ్లలో తీసుకోవాలి.
ఇక సమతుల ఆహారంతోపాటు నిత్యం మనం ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తింటున్నాం, ఎంత మేర క్యాలరీలను ఖర్చు చేస్తున్నాం.. అనే విషయాన్ని కూడా గమనించాలి. శారీరక శ్రమ చేయని వారికి నిత్యం 1500 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం సరిపోతుంది. కానీ నిజానికి చాలా మంది ఇంతకన్నా ఎక్కువగానే క్యాలరీలను ఇచ్చే ఆహారాలను తింటుంటారు. దీంతో అధికంగా ఉండే క్యాలరీల తాలూకు శక్తి అంతా కొవ్వుగా మారుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
కనుక మనం తీసుకునే ఆహారం ద్వారా లభించే క్యాలరీలను ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. నిత్యం 2వేల క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే అందులో 200 నుంచి 300 క్యాలరీలను ఖర్చు చేయాలి. లేదా 1500 క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే అందులో 100 నుంచి 200 క్యాలరీలను ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. ఇక మనం ఆహారంలో అన్నం తింటున్నామా, చపాతీలు తింటున్నామా.. అనేది చూడాల్సిన పనిలేదు. కానీ ఏం తిన్నా శారీరక శ్రమ చేయని వారు ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. దీంతోపాటు వ్యాయామం కూడా చేస్తే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.