వర్షాకాలం సీజన్ లో సహజంగానే దోమలు విజృంభిస్తుంటాయి. ఈ సీజన్‌లో దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియాతోపాటు విష జ్వరాలు ప్రబలుతుంటాయి. అందుకనే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది దోమల సంఖ్యను నియంత్రించేందుకు, వాటిని నాశనం చేసేందుకు ఈ సీజన్‌లో చెరువులు, చిన్న చిన్న కుంటల్లో, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబూసియా చేపలను వదులుతుంటారు. అయితే వీటి గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గంబూసియా చేపలు దోమల్లాగే తక్కువ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనూ పెరగగలవు. ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వీటిని నీటిలోకి వదులుతారు. దీంతో ఇవి దోమల లార్వాను తిని పెరుగుతాయి. ఈ చేపలకు ఆకలి ఎక్కువ. అందువల్ల కొంచెం వయస్సు వచ్చిన గంబూసియా చేపలు రోజుకు సుమారుగా 150కి పైగా దోమల లార్వాలను తినగలవు. దీంతో దోమలు పెద్దగా అవకముందే చనిపోతాయన్నమాట. ఇలా గంబూసియా చేపలతో దోమలకు అడ్డుకట్ట వేయవచ్చు.
గంబూసియా చేపలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ వంటి దోమలకు చెందిన లార్వాలను తింటాయి. అందువల్లే ఈ చేపలను పెద్ద ఎత్తున నీటి కుంటలు, చెరువుల్లోకి వదులుతారు. వీటి వల్ల దోమల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. దోమలతో వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థే స్వయంగా వెల్లడించింది. గంబూసియా చేపలతో దోమలను నివారించవచ్చని, ఈ చేపల వల్ల ప్రజలకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపింది. అందువల్ల అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఈ చేపలను.. దోమలను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్నాయి.
అయితే గంబూసియాతోపాటు గప్పీ అనే ఇంకో రకానికి చెందిన చేపలను కూడా దోమలను చంపేందుకు వాడుతున్నారు. ఈ చేపలు కూడా గంబూసియా చేపల్లాగే దోమల లార్వాలను తినగలవు. తెలుగు రాష్ట్రాల్లో గంబూసియా చేపలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గప్పీ చేపలను వాడుతున్నారు. ఈ విధంగా చేపలతో దోమలను అంతం చేస్తున్నారు.